ATP TDP President Race

ATP TDP President Race: బీసీ వర్సెస్‌ బీసీ.. కమ్మ వర్సెస్‌ రెడ్డి.. రసవత్తరంగా రేసు!

ATP TDP President Race: స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిన టీడీపీ.. జిల్లాల్లో సమన్వయం కోసం అధ్యక్షుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో జిల్లా అధ్యక్షుల కోసం ఆశావహుల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. ఒక్కో పార్లమెంటు పరిధిలో దాదాపు పది మంది వరకు జిల్లా అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్నారు. పార్టీ అధిష్ఠానం మాత్రం జిల్లా అధ్యక్షుల ఎంపికని అన్ని ఈక్వేషన్స్ జోడించి ప్రకటించబోతోందనేది వార్తలు వినవస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో, టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుల పదవి కోసం గట్టి పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. హిందూపూరం పార్లమెంటు పరిధిలో జిల్లా అధ్యక్షుడి కోసం సీనియర్ నాయకులతో పాటు జూనియర్ నాయకులు కూడా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వడ్డే అంజనప్ప.. తనని మరో టర్మ్ కొనసాగించాలని పార్టీ పెద్దలను విజ్ఞప్తి చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు అధ్యక్ష పదవి చేపట్టారు వడ్డే అంజనప్ప. దాదాపు రెండు సంవత్సరాల కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. వివాదరహితుడిగా అందరితో కలిసిపోయే విధంగా పదవి నిర్వహించారు. వడ్డే సామాజిక వర్గానికి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారాయన. ఇక మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నారు. మడకశిర నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఈయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బలమైన సామాజిక వర్గం, సీనియర్ నాయకుడు కావడంతో, జిల్లా అధ్యక్షుడి పదవి ఇస్తే పార్టీని మరింత సమర్థవంతంగా నడపగలరని భావిస్తున్నారు.

యాదవ సామాజిక ఈక్వేషన్ కోటాలో కూడా ఈయన జిల్లా అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ఇక వాల్మీకి సామాజిక వర్గం నుంచి రంగయ్య అనే వ్యక్తి కూడా జిల్లా అధ్యక్షుడి పోటీలో నిలుస్తున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో అనేక మంది వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా ఇప్పటికే ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డి కూడా జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో, ఒక కుటుంబంలో రెండు పోస్టులు ఇస్తారా లేదా అనేది సందిగ్ధమే. అయితే, పార్టీని పార్లమెంటు పరిధిలో సమర్థవంతంగా నడిపే నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసిపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి. పోటీ తీవ్రంగా ఉండటంతో అధిష్టానం చాలా సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే, హిందూపూర్ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడి రేసులో బీసీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనేది పెద్ద చర్చగా నడుస్తోంది.

ALSO READ  Supreme Court: యూపీ, హర్యానాలలో బాణాసంచాపై పూర్తి నిషేధం

Also Read: Kavitha: భవిష్యత్తులో KTR, KCRలపై కుట్రలు.. హరీష్‌ రావు ట్రబుల్‌ షూటర్‌ కాదు.. బబుల్ షూటర్‌!

ఇక అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడి కోసం దాదాపు 10 మంది పోటీలో ఉన్నారని సమాచారం. అయితే ప్రధానంగా నలుగురు మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ కుల సమీకరణాలతో పాటు, వ్యక్తి ట్రాక్ రికార్డును కూడా పరిశీలిస్తున్నారట. అనంతపూర్ పార్లమెంటు జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా కమ్మ సామాజికవర్గం నుంచి గడ్డం సుబ్రహ్మణ్యం, రామ్మోహన్ చౌదరి, ఆలం నరస నాయుడు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురూ టీడీపీలో చాలా సీనియర్ నాయకులు. కమ్మ సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం వీరి మధ్య పోటీ చాలా సీరియస్‌గా ఉండే అవకాశం ఉంది. బహుషా ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సామాజికవర్గం నుండి బుక్కరాయసముద్రం మాజీ జెడ్పీటీసీ, రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి అధ్యక్షుడి రేస్‌లో ఉన్నారు. అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ కోసం కష్టపడే వ్యక్తి. రెడ్డి సామాజిక ఈక్వేషన్స్‌లో జిల్లా అధ్యక్షుడిని ఇస్తే మాత్రం రామలింగారెడ్డికి పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక బలిజ సామాజిక వర్గం నుంచి జె.ఎల్. మురళి పోటీలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ శివుడు యాదవ్‌ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, ఇప్పటికే రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ చైర్మన్‌గా ఆయనకు పదవి ఇచ్చిన నేపథ్యంలో మరోసారి అవకాశం ఉండకపోవచ్చనేది ఓ వాదన. వాల్మీకి కమ్యూనిటీ నుంచి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదినారాయణ పోటీలో ఉన్నారు. అయితే, జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వాల్మీకి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో, ఈ సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్షుడిని కేటాయించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

ఇలా అనంతపూర్, హిందూపూర్ రెండు పార్లమెంటు జిల్లాలకు జరుగుతోన్న అధ్యక్షుల రేస్ కాక రేపుతోంది. పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఆశావహుల శిబిరాల్లో కొనసాగుతోంది. టీడీపీకి రాయలసీమ జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టారు. అదే ఊపుతో లోకల్ బాడీ ఎన్నికలు కూడా రిపీట్ చేయాలని చంద్రబాబు, నారా లోకేష్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేసి, తిరిగి లేని శక్తిగా ఎదగాలనేది టీడీపీ ప్లాన్‌. అందుకే ఎన్నడూ లేని విధంగా జిల్లా అధ్యక్షుల ఎంపికను చాలా సీరియస్‌గా తీసుకుని, తీవ్ర కసరత్తు చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఒక బీసీ, ఒక ఓసీ అధ్యక్షులను నియమించాలనేది ప్రతిపాదనగా తెలుస్తోంది. ఈ సమీకరణాలన్నీ వడబోసి జిల్లా అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేస్తారనేది మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతోంది. చూడాలి మరి, ఈ పదవులు ఎవరికి వరిస్తాయనేది. వెయిట్ అండ్ సీ.

ALSO READ  Mahaa Vamsi: మహా విజయం.. డీ గ్యాంగ్ గుట్టు రట్టు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *