Palleku Peddalu

Palleku Peddalu: లోకేష్‌తో కలిసి కనిగిరికి అనంత్‌ అంబానీ..!

Palleku Peddalu: సముద్రం ఒకవైపు, కొండలు మరోవైపు హద్దుగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నడూ చూడని రాజకీయ సందడిని నెలకొంది. ఈ మారుమూల పల్లెలు, వలస బతుకులకు నిలయమైన కుగ్రామాలు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాకతో ఉరకలు వేస్తున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో మంగళవారం సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతుండగా, కనిగిరిలో బుధవారం లోకేష్, రిలయన్స్ దిగ్గజం అనంత్ అంబానీలు బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కోసం వస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా ఒక నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు, ఈసారి ప్రకాశం జిల్లాను ఎంచుకోవడం విశేషం. పర్చూరులో చంద్రబాబు పర్యటన ప్రజల ఆర్థిక భరోసాకు బీజం వేయనుంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాలతో సీఎం నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. మరోవైపు, కనిగిరిలో లోకేష్-అనంత్ అంబానీల రాక రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. రిలయన్స్‌ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో పెట్టుబడులను తిరిగి పట్టాలెక్కించింది.

Palleku Peddalu: ఈ క్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పట్టుదలతో కనిగిరిలో తొలి బయోగ్యాస్ యూనిట్ రూపొందనుంది. వలసలకు నిలయమైన కనిగిరి నియోజకవర్గంలో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం పలకనుండటం అక్కడి ప్రజల్లో కొత్త ఆశలను రేపుతోంది. నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి కోసం పరిశ్రమలు రాబట్టేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఎమ్మెల్యే ఉగ్ర.. రిలయన్స్ సంస్థను తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. రాష్ట్రంలో బయోగ్యాస్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సిద్ధమైన రిలయన్స్‌ సంస్థ.. తన తొలి యూనిట్‌ని కనిగిరిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడంతో ఉగ్ర కల నిజమైంది.

Also Read: Revanth Cabinet Plans: కేటీఆర్‌ టార్గెట్‌గా రేవంత్‌ రివర్స్‌ ప్లాన్‌?

పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలోని కొండ ప్రాంతాల్లో మంత్రి లోకేష్‌ – అనంత్‌ అంబానీల పర్యటనకి ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. కొండకు దిగువన జన సంచారం లేని ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటుకు అవకాశం లేదని అధికారులు చెప్పినా… పట్టుబట్టి ఆ ప్రాంతాన్ని చదునుచేసి భూమిపూజ చేయిస్తానని ఒప్పించగలిగారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. దారి కూడా సరిగా లేని ఆ ప్రాంతానికి ఆగమేఘాలపై రోడ్డును నిర్మింపజేశారు. కొండకు దిగువన 25 ఎకరాలను నాలుగు రోజుల్లో బాగు చేయించారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. విషయం తెలిసి నియోజకవర్గ ప్రజలు గత నాలుగు రోజులుగా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ జరిగిన ఏర్పాట్లు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. రెండు హెలికాఫ్టర్లు దిగేందుకు, వేలాది మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.

ALSO READ  Rahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్

Palleku Peddalu: కనిగిరి ప్రజలకు ఈ పరిశ్రమ ఉపాధి కలలను నిజం చేయనుంది. చుక్క నీరు దొరకని, వలసలతో కృశించిన ఈ నియోజకవర్గంలో రిలయన్స్ రాకతో ఆశలు చిగురిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో అభివృద్ధి అనే మాటే వినని ఈ ప్రాంతంలో.. కూటమి చొరవతో ప్రారిశ్రామికాభివృద్ధికి అడుగులు పడుతుండటం ఉమ్మడి జిల్లా ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది. ఇక మంత్రి లోకేష్ నుంచి ట్రిపుల్ ఐటీ, సోలార్ ప్రాజెక్టులపై హామీలు ఆశిస్తున్న కినిగిరి ప్రజలు, అనంత్ అంబానీ కూడా వస్తుండటంతో భవిష్యత్ పెట్టుబడులపై నమ్మకం పెంచుకుంటున్నారు. మొత్తం మీద ఇద్దరు అగ్రనేతల పర్యటనలు ప్రకాశం జిల్లాలో రాజకీయంగా, ఆర్థికంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాయి. చంద్రబాబు-లోకేష్ జోడీ వైసీపీ నిర్లక్ష్యాన్ని తుడిచిపెట్టి, అభివృద్ధిని ట్రాక్‌పై పరుగులు పెట్టిస్తుందని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *