Kodali Nani: ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనలతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో దడ పుట్టిస్తున్నారు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లిన లోకేష్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. లోకేష్ ఢిల్లీ పర్యటనలు చేపట్టిన ప్రతిసారీ వైసీపీ నేతలపై ఒత్తిడి, ఆందోళన పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లోకేష్ ఢిల్లీ యాత్రలు వైసీపీ నేతల అరెస్టులకు సంబంధించినవే అని ప్రచారం జరుగుతుండటం ఇందుకు కారణం కావొచ్చని అంటున్నారు. లోకేష్ తాజా పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో కీలక అరెస్టులు ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు వెలుగులోకి రావడం గమనార్హం.
లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ నేతలపై ఒత్తిడి పెరగడంతో పలువురు దేశం విడిచి పారిపోయేందుకు పాస్‌పోర్టులు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో పారిపోయే ప్రయత్నంలో అరెస్టయ్యారు. ఇదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా కోల్‌కత్తా విమానాశ్రయం నుంచి కొలంబోకు పారిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, కొడాలి నాని అరెస్ట్ వార్తలను ఏపీ పోలీసులు ఖండించారు. కొడాలి నానిపై లుక్‌అవుట్ నోటీస్ జారీ చేసినప్పటికీ, ఆయనను అరెస్టు చేయలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు.
Also Read: Jagan in Danger: ఈ ప్రమాదం వైసీపీని ముంచేయబోతుందా?
Kodali Nani: రెండు నెలల క్రితం కొడాలి నాని ముంబయిలో గుండె బైపాస్ సర్జరీ చేయించుకొని, నెల రోజులు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు సమాచారం. గుడివాడలో ఆయన కోసం వైసీపీ కార్యకర్తలతో పాటూ టీడీపీ శ్రేణులు కూడా ఎదురుచూస్తున్నాయి. అయితే కొడాలి నాని హైదరాబాద్‌లోనే ఉన్నారా, లేక ముంబయి, బెంగళూరు, కోల్‌కత్తా వైపు వెళ్లారా అన్నది ప్రస్తుతానికి రహస్యమే. కొడాలి నాని ఎక్కడున్నా సరే… క్షేమంగా, పూర్తి ఆరోగ్యంతో గుడివాడకు తిరిగి రావాలని టీడీపీలోని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే కొడాలిపై పలు కేసులు నమోదైనా, ఇప్పటివరకు నోటీస్ జారీ కాలేదని, విచారణ ఏ దశలో ఉందన్నది స్పష్టత లేదని వారంతా అసహనంగా ఉన్నారు. కొడాలి నాని కోలుకుని తిరిగొస్తే తప్ప కేసులు ముందుకు కదిలే పరిస్థితి లేదని వారంతా భావిస్తున్నారు. మరి.. కొడాలి నాని తనంతట తానే గుడివాడకు వస్తారా? లేక చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అంతకు ముందు కాకాణి గోవర్థన్ రెడ్డిలాగా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేసి ఎయిర్‌పోర్టులో పట్టుబడతారా అన్నది వేచి చూడాలి.

