Kerala: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని రూ.1,033.62 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్‌ను కేరళ ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రణాళికలో సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బ్లూప్రింట్‌ను రూపొందించారు. మొత్తం రూ.778.17 కోట్ల వ్యయంతో సన్నిధానాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. మొదటి దశకు రూ.600.47 కోట్లు, రెండో దశకు రూ.100.02 కోట్లు, మూడో దశకు రూ.77.68 కోట్లు కేటాయించారు.
సన్నిధాన ప్రాంతాన్ని ఎనిమిది జోన్లుగా విభజించి, భక్తుల రద్దీని నియంత్రించేందుకు రెండు ఓపెన్ ప్లాజాలు నిర్మిస్తారు. మకరవిళక్కు (మకర జ్యోతి) దృశ్యాలు స్పష్టంగా కనిపించేలా ప్రణాళికలు రూపొందించారు. పంపా అభివృద్ధికి మొత్తం రూ.207.48 కోట్లు ఖర్చవుతుంది, ఇందులో మొదటి దశకు రూ.184.75 కోట్లు, రెండో దశకు రూ.22.73 కోట్లు కేటాయించారు. ట్రక్ రూట్ అభివృద్ధికి రూ.47.97 కోట్లు ఖర్చుచేయనున్నారు, ఇందులో షెల్టర్లు, విశ్రాంతి భవనాలు, అత్యవసర వాహన లేన్లు, పర్యావరణ పునరుద్ధరణకు బఫర్ జోన్‌లు ఏర్పాటు చేస్తారు. మొత్తం పంపా, ట్రక్ రూట్ అభివృద్ధికి రూ.255.45 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. ఈ ప్రాజెక్టు ఆలయ ఆధ్యాత్మికత మరియు సాంస్కృతికతకు భంగం కలుగకుండా రూపుదిద్దుకుంది.