te: తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో మొదటి విడత ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి సర్పంచ్ స్థానాలను ఎన్నికలకు ముందుగానే కొంతమంది వేలం పాటలో ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, మరికొంత మంది ఏకగ్రీవంగా కూడా గెలిచారు. రెండో విడత ఎలక్షన్ సమయంలో ఎక్కడా లేని విధంగా సర్పంచ్ పోటీ అభ్యర్థిని కొంతమంది కళ్లలో కారం చల్లి కొట్టిన ఘటన చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వంసిద్ధం ఈ సమయంలో సర్పంచ్ అభ్యర్థి కొమరయ్యపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయాలైన ఒక వ్యక్తిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు కొమరయ్యను అడ్డగించి చితకబాదారు. ఆయనను కొట్టడానికి ముందు కళ్లలో కారం పోసి దాడికి పాల్పడ్డారు.
తనపై జరిగిన దాడిపై పోలీసులకు కొమరయ్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు ఎందుకు దాడి చేశారు? దాడికి పాల్పడిన దుండగులు ఎవరు? పాత కక్షల లేదా ఎన్నికల సమయంలో ఏదైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
