Ashwini Vaishnaw: తెలంగాణ ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక తీపి కబురు అందించారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వంటి నగరాలకు ప్రయాణం విమానం కంటే వేగంగా, అత్యంత సులభం కానుంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న హైస్పీడ్ రైలు కారిడార్ వల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైళ్లు గంటకు ఏకంగా 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయని, ఇది మన ప్రయాణ అనుభవాన్నే మార్చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణానికే పరిమితం కాకుండా, తెలుగు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చబోతోంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి 2.55 గంటల్లో, పుణెకు కేవలం 1.55 గంటల్లో వెళ్లేలా మూడు ప్రధాన రూట్లలో ఈ రైళ్లు రానున్నాయి. దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడటమే కాకుండా, హెల్త్ టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతాయని మంత్రి వివరించారు. దూర ప్రాంతాల నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వచ్చే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం తెలంగాణ రైల్వే రంగానికే రూ. 5,454 కోట్లు కేటాయించడం విశేషం. ఈ నిధులతో స్టేషన్ల ఆధునీకరణ, కొత్త లైన్ల పనులు వేగవంతం కానున్నాయి. ఈ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరికీ సమయం ఆదా అవుతుంది. మొత్తానికి ఈ బుల్లెట్ వేగంతో సాగే ప్రయాణం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఒక గేమ్ ఛేంజర్ కాబోతోంది.
