Asaduddin owaisi: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాదీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, చంద్రబాబును రాజకీయాల నుంచి తప్పుకుని బాధ్యతలను తన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు అప్పగించాలని సూచించారు.
ఒవైసీ మాట్లాడుతూ, “చంద్రబాబు గారూ, మీరు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఎలాగైనా మీ తర్వాత మీ కొడుకే బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రాడు కదా? మీరు లోకేశ్‌ను బలహీనంగా చేస్తూ, అతని దిశను మార్చేస్తున్నారు” అని అన్నారు.
అలాగే చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితం గురించి గుర్తుచేస్తూ, “మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, విభజిత రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందించారు. అది చాలింది. ఇప్పుడు ఇక లోకేశ్ బాధ్యత తీసుకునేలా చేయండి” అని సూచించారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతర సమీకరణాల నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
