Ayodhya: శ్రీరామనవమి త్వరలో రాబోతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిర ట్రస్ట్ రామాలయానికి సంబందించిన 8 ప్రత్యేక కొత్త చిత్రాలను విడుదల చేసింది. ఈ ఫోటోల ద్వారా మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఏర్పాటు కోసం తెల్లటి పాలరాయి సింహాసనాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
గ్రౌండ్ ఫ్లోర్ లాగే, మొదటి అంతస్తులో కూడా ఒక సింహాసనం తయారు చేశారు. గర్భగుడిలో అద్భుతమైన శిల్పాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో మండపం నిర్మించారు. రామజన్మభూమి సముదాయంలో రామాలయంతో పాటు మరో 14 ఆలయాలు నిర్మిస్తున్నారు. విగ్రహాల ప్రతిష్టాపనకు పవిత్రమైన తేదీ ఏప్రిల్ 30 (అక్షయ తృతీయ) ప్రాణ ప్రతిష్ఠ జూన్ 5 (గంగా దసరా) గా నిర్ణయించారు. అయితే, ఈ తేదీలకు ట్రస్ట్ ఆమోదం ఇంకా ఇవ్వలేదు.
రామ్ దర్బార్ విగ్రహాలన్నీ రాజస్థాన్ లోని జైపూర్ లో తయారవుతున్నాయి. అన్ని విగ్రహాలు ఏప్రిల్ 30 లోపు ఇక్కడికి చేరుకుంటాయి. రామ మందిరం మొదటి అంతస్తులో రామ దర్బార్ ఏర్పాటు చేయనుండగా, సరిహద్దు గోడలో 6 ఆలయాలు నిర్మిస్తున్నారు. వీటిలో సూర్యుడు, గణేష్, హనుమంతుడు, శివుడు, మాతా భగవతి, మాతా అన్నపూర్ణ విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
ఇది కాకుండా, సప్త మండపంలో 7 ఆలయాలు నిర్మిస్తున్నారు. వీటిలో మహర్షి వాల్మీకి, మహర్షి విశ్వామిత్రుడు, మహర్షి అగస్త్యుడు, మహర్షి వశిష్ఠుడు, నిషాదరాజు, అహల్య, శబరి విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.
ఇది కూడా చదవండి: Aadhar Link With Voter ID: ఓటరు ఐడీ తో ఆధార్ లింక్.. సన్నాహాలు షురూ
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కరసేవక్ పురంలో సమావేశం అయింది. విగ్రహాల ప్రతిష్టాపన – ప్రాణ ప్రతిష్టల శుభ సమయం, తేదీపై జ్యోతిష్కులతో ఈ సమావేశం నిర్వహించింది. జ్యోతిష్కులతో పాటు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మరియు నిర్మాణ ఇన్‌చార్జ్ గోపాల్ రావు కూడా హాజరయ్యారు. విగ్రహాల ప్రతిష్టకు అక్షయ తృతీయ (ఏప్రిల్ 30), ప్రాణ ప్రతిష్ఠకు గంగా దసరా (జూన్ 5) ఉత్తమ తేదీ అని అప్పుడే నిర్ణయించారు. ప్రాణ ప్రతిష్ఠ శుభ సమయానికి ట్రస్ట్ తుది ఆమోదముద్ర వేయాల్సి ఉంది.