Free Bus Scheme

Free Bus Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. ఏపీలో 2500 కొత్త ఆర్టీసీ బస్సులు..

Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారీ స్థాయిలో కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు, ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునే మహిళలకు కూడా పెద్ద ఊరట లభించనుంది.

ఏపీలో 2500 కొత్త ఆర్టీసీ బస్సులు: ఎండీ కృష్ణబాబు ప్రకటన

ఏపీఎస్ఆర్టీసీ నూతన వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD)గా ఎంటీ కృష్ణబాబు సోమవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది మొత్తం 2500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. వీటిలో పీఎం ఈ-బస్ (PM e-Bus) పథకం కింద వచ్చే 1050 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, మిగిలిన 1450 బస్సులు ఎలక్ట్రిక్ – సీఎన్జీ (CNG) విభాగాల్లో ఉండనున్నాయి.

మహిళల ఉచిత ప్రయాణానికి మరింత వెసులుబాటు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ (ఉచిత బస్సు ప్రయాణం) పథకం పట్ల మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 23 నుంచి 25 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. దీనివల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 90 శాతానికి చేరుకుంది. రద్దీ పెరగడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఆర్టీసీ, ఈ కొత్త బస్సుల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చూపనుంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే మహిళలకు మరింత సౌకర్యవంతంగా, రద్దీ లేని ప్రయాణం అందుతుందని ఎండీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Crime News: వివాహం కావడం లేదు.. హుస్సేన్ సాగర్‌లో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య

పర్యావరణ హితంగా ఆర్టీసీ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, భవిష్యత్తులో రాబోయే కొత్త బస్సులన్నీ అత్యాధునిక సౌకర్యాలతో ఉండబోతున్నాయి. పల్లె వెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ సర్వీసుల వరకు కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఏసీ (Air Conditioned) సౌకర్యంతో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2030 నాటికి ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ – సీఎన్జీ బస్సులను మాత్రమే నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, సంస్థకు ఇంధన ఖర్చులు కూడా తగ్గుతాయి.

మౌలిక సదుపాయాల అభివృద్ధి

కేవలం బస్సులు మాత్రమే కాకుండా, ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 3,000 కోట్ల రూపాయలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు కృష్ణబాబు తెలిపారు. బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఖాళీగా ఉన్న ఆర్టీసీ భూములను వాణిజ్యపరంగా వినియోగించుకోవడం ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *