Rain Alert

Rain Alert: ఏపీకి వాయుగుండం గండం.. తీరం దాటినా వదలని వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!

Rain Alert: ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. గత కొద్ది రోజులుగా ఆందోళన కలిగిస్తున్న వాయుగుండం ముప్పు మన రాష్ట్రానికి తప్పింది. శ్రీలంక సమీపంలో తీరం దాటిన ఈ వాయుగుండం క్రమంగా బలహీనపడి తమిళనాడు వైపునకు కదులుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తక్కువగా ఉండటంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకవేళ ఇది గనుక తీవ్రరూపం దాల్చి ఉంటే, చేతికి వచ్చిన పంటలు దెబ్బతినేవి. ప్రస్తుతం ఇది కేవలం అల్పపీడనంగా మారి తన ప్రభావాన్ని తగ్గిస్తోంది.

వాయుగుండం బలహీనపడినప్పటికీ, దీని ప్రభావంతో రాయలసీమ మరియు దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడవచ్చు. అలాగే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల ఎండ తీవ్రత తక్కువగా ఉండి, వాతావరణం చల్లగా ఉంటుంది.

వర్షాల కంటే కూడా ఇప్పుడు చలి తీవ్రత ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెట్టేలా ఉంది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చలి పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం నాడు ముంచంగిపుట్టులో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ చలి గాలులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో కూడా చలి పంజా విసురుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, వచ్చే మూడు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్న గాలులే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ చలి విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *