Donkey Milk

గాడిదలిస్తాం.. గాడిద పాలు కొంటాం..అని చెప్పి.. కోట్లు కొల్లగొట్టేశారు!

అడ్డగాడిద అని ఎవరైనా అంటే చాలా కోపం వస్తుంది. అసలు అడ్డా గాడిదలు ఎక్కడైనా ఉంటాయా? అనే అనుమానమూ వస్తుంది. నిజానికి అడ్డా గాడిద అనేది ఏదీ లేదు.. గాడిదల అడ్డా సిద్ధంగా పనులు చేస్తుంటే అడ్డ గాడిద అని అనడం సాధారణంగా మారిపోయింది. సరే ఇప్పుడు ఈ గాడిద గోల ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి అన్నారు. అలాగే కావేవీ మోసానికి అనర్హం అంటూ కొంతమంది ఎప్పటికప్పుడు వినూత్నంగా జనాల్ని నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా గాడిద పాలు పేరుతో కోట్లాదిరూపాయలు దండేశాడు ఓ మహానుభావుడు. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం..

ఏపీ నుంచి కర్ణాటకకు వెళ్లి మరీ అక్కడి సామాన్య రైతులను ముంచేశాడు అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే ఘనుడు. మూడు లక్షలు మాకివ్వండి.. మూడు జతల గాడిదలు ఇస్తాం. లీటరు పాలు రూ.2,350లకు కొంటాం అంటూ ప్రచారంతో హోరెక్కించాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో ‘జెన్ని మిల్క్‌’ అంటూ ఆర్భాటంగా ఒక సంస్థను ప్రారంభించాడు. భారీ ప్రచారంతో అక్కడి రైతులను ఆకట్టుకున్నాడు. ఒక్కో రైతు నుంచి మూడు లక్షల చొప్పున దాదాపుగా ౩౦౦ మంది రైతుల దగ్గర నుంచి లాగేశాడు. ముందుగా డబ్బు కట్టిన కొంతమందికి గాడిదలను అందచేశారు. దీంతో ఎక్కువ మంది రైతులు ఇది నిజమని నమ్మేశారు. డబ్బులు కట్టేశారు.

అయితే, తళవార్ నాగరాజు అనే రైతుకు అనుమానం వచ్చింది. తనకు అనుమానంగా ఉంది అంటూ ఈ విషయంపై అధికారులకు కంప్లైంట్ చేశాడు. దీంతో అసలు కథ బయటపడింది. ఈ విషయంపై విజయనగర జిల్లా ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్‌ నేతృత్వంలో అధికారులు విచారణ జరిపారు.

ఈ విచారణలో అసలు ఆ సంస్థకు కావలసిన అనుమతులేవీ లేవని తేలింది. దీంతో ఆ వ్యాపారాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మీడియాకు మోసం గురించిన పలు సమాచారాన్ని అందించారు. మూడు ఆడ గాడిదలు.. మూడు మగ గాడిదలు కలిపి ఒక యూనిట్ గా చెప్పి.. యూనిట్ కు మూడు లక్షల రూపాయలుగా వసూలు చేశాడు మురళి. జెన్నీ మిల్క్ పేరుపై రూ.500 స్టాంప్ పేపర్లపై రైతులతో మూడేళ్లకు ఒప్పందం సంతకం చేయించుకున్నాడు. మొదట్లో ఈ ఎగ్రిమెంట్ లో ఎంటర్ అయిన వారికి డబ్బు కట్టిన 20 రోజుల్లోనే గాడిదలను అందచేశాడు. ఈ గాడిదల నుంచి రోజుకు లీటరున్నర పాలు వస్తాయని అంచనాగా బాండ్ లో రాసుకున్నారు. ఒకవేళ అంచనాకన్నా ఎక్కువ పాలు వస్తే ఒప్పందం నుంచి కంపెనీ తప్పుకుంటుందని క్లాజ్ ఉంది. అదే తక్కువ పాలు వస్తే పది రోజుల్లో గాడిదను మార్చి.. వేరే గాడిదను ఇస్తామని కూడా ఆ అగ్రిమెంట్ లో రాసుకున్నారు. లీటరుకు రూ.2,350 లు కంపెనీ చెల్లిస్తుందని చెప్పారు.

ALSO READ  WTC Final: WTC ఫైనల్.. గెలుపుపై ఉత్కంఠ..

నిజానికి ఒక్కో గాడిద జత (ఒక ఆడ గాడిద, ఒక మగ గాడిద) 20 వేల నుంచి 30 వేల రూపాయల వరకూ ఉంటుంది. కానీ ఈ సంస్థ ఏకంగా లక్షరూపాయలు ప్రజల నుంచి లాగేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *