AP News

AP News: ఏపీ డిప్యూటీ తహసీల్దార్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అధికారికంగా గెజిటెడ్ హోదా..!

AP News: ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ పరిపాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చిరకాల డిమాండ్‌ను పరిష్కరిస్తూ.. రాష్ట్రంలోని డిప్యూటీ తహసీల్దార్లకు (Deputy Tahsildars) అధికారికంగా గెజిటెడ్ హోదా (Gazetted Status) కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తూ రెవెన్యూ శాఖ అధికారికంగా జీవో (GO) విడుదల చేసింది.

సర్వీస్ రూల్స్‌లో కీలక మార్పులు – జీవో విడుదల..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కేటగిరీ-4 కింద నాన్-గెజిటెడ్ హోదాలో కొనసాగుతున్నాయి. చాలా కాలంగా తమకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని రెవెన్యూ ఉద్యోగులు, అధికారుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దింతో ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పాలనా సౌలభ్యాన్ని సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం.. సర్వీస్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ మండలాల్లో, డివిజన్లలో పనిచేస్తున్న వందలాది మంది డిప్యూటీ తహసీల్దార్లకు అధికారికంగా గెజిటెడ్ హోదా లభించింది.
పాలనలో వేగం – ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు..
డిప్యూటీ తహసీల్దార్లకు గెజిటెడ్ హోదా దక్కడం వల్ల రెవెన్యూ శాఖ పరిధిలో సానుకూల మార్పులు రానున్నాయి. భూ రికార్డుల పరిశీలన, ధ్రువీకరణ పత్రాల జారీ, పరిపాలనాపరమైన క్షేత్రస్థాయి విధుల్లో అధికారులకు మరింత స్వేచ్ఛ, అధికారాలు లభించనున్నాయి. దీనివల్ల ప్రజలకు అందే సేవల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చినందుకు రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సహా పలు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *