Kakani Govardhan Reddy: జైలు పాలైన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కొత్తగా మరో కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల చట్టాల ఉల్లంఘన కేసులో రిమాండ్‌లో ఉన్న కాకాణిపై, ఇప్పుడు పంటపాలెం వద్ద టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లు జరిపిన ఘటనపై కూడా కేసు నమోదయ్యింది.
ముత్తుకూరు మండలంలోని పంటపాలెం సమీపంలో ప్రైవేట్ టోల్ గేట్ ఏర్పాటు చేసి స్థానికుల నుండి నిధులు వసూలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేసును నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: TGSRTC Fare Hiked: ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్.. బస్‌పాస్ చార్జీలు భారీగా పెరిగాయి
ఈ కేసులో కాకాణి అనుచరుడిగా ఉన్న తూపిలి శ్రీధర్ రెడ్డి, అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిస్వామిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, నెల్లూరులో ఉన్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం, అక్రమ మైనింగ్ కేసులో కాకాణి రిమాండ్‌ను ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై వాదనలను జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది.