Annamalai: తమిళనాడు బీజేపీ కే. అన్నామలై, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఎంఎన్ఎస్–శివసేన ర్యాలీలో థాకరే అన్నామలైపై ఎద్దేవాగా వ్యాఖ్యానిస్తూ, “తమిళనాడు నుంచి ఒక రసమలై వచ్చాడు. ముంబైకి నీకు సంబంధమేంటి? హటావో లుంగీ బజావో పుంగీ” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై అన్నామలై ఘాటు కౌంటర్ ఇచ్చారు. “నన్ను బెదిరించడానికి రాజ్ థాకరే, ఆదిత్య థాకరే ఎవరు?” అంటూ ప్రశ్నించారు. రైతు కొడుకుగా ఉన్నందుకు గర్విస్తున్నానని, రాజకీయ బెదిరింపులు తనను భయపెట్టలేవని స్పష్టం చేశారు. “నేను ముంబైకి వస్తే కాళ్లు నరికేస్తామని కొందరు రాశారు. వస్తా… ప్రయత్నించండి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే నా ఊరినుంచే బయటికి రానయ్యేవాడిని” అని అన్నామలై వ్యాఖ్యానించారు.
ముంబై ప్రతిష్ఠ మరాఠీల కృషితో ముడిపడి ఉందన్న అభిప్రాయాన్ని ఖండిస్తూ, “కామరాజ్ గొప్ప నాయకుడు అని చెబితే ఆయన తమిళుడు కాదా? ముంబై ప్రపంచ స్థాయి నగరం అని చెబితే మరాఠీలు అభివృద్ధి చేయలేదని ఎలా అవుతుంది?” అని ప్రశ్నించారు. ముంబై పురోగతిలో సర్వ సమూహాల పాత్ర ఉందని అన్నారు.
దుస్తుల ఆధారంగా జాతి, భాషను చిన్నచూపు చూడటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘లుంగీ, ధోవతి’లను హేళన చేస్తూ తమిళులను అవమానించడం సరికాదని పేర్కొన్నారు. అంతేకాదు, తమిళులపై వ్యాఖ్యలు చేస్తున్న శివసేన యూబీటీతో డీఎంకే పొత్తును ప్రశ్నించారు. “నన్ను విమర్శిస్తున్నవారు అజ్ఞానులు” అంటూ అన్నామలై స్పష్టంచేశారు.
