Elite Cricket League: ఆంధ్రప్రదేశ్‌లో యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని చామల ఫౌండేషన్ చేపట్టిన ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్–2కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ కు మంచి స్పందన లభించింది. నాటి ప్రైజ్ మనీ మన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన రెండు తెలుగు రాష్ట్రాలలోని జవాన్లకు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భారీ టోర్నమెంట్ జరగనుంది.
ఈ సందర్భంగా జరిగిన జెర్సీ లాంచ్ ఈవెంట్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏపీ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కార్యక్రమానికి హాజరవడంతో కార్యక్రమం మరింత హోరెత్తింది.
Also Read: CM Chandrababu: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఏసీబీ కోర్టు క్లీన్‌చిట్
ఏపీ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… “యువతలో డ్రగ్స్ వ్యసనాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూత, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవానుల కుటుంబాలకు అండగా ఉండేందుకు చామల ఫౌండేషన్ చేస్తున్న ఈ సేవలు ప్రశంసనీయం అన్నారు. ఇలాంటి సమాజోపయోగ కార్యక్రమాలకు క్రీడలను అనుసంధానం చేసి ECL ట్రోఫీని నిర్వహించడం చైర్మన్ ఉదయ్ చందర్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ హంగులతో విశాఖ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ రాష్ట్ర క్రీడా రంగానికి కొత్త ఊపు తీసుకురానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ రంగాల ప్రముఖులు, యువ క్రీడాకారులు పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ తండర్స్, బుల్లితెర రేంజర్స్, ఆంధ్ర పొలిటికల్ కింగ్స్, వైరల్ చీతాస్, పోలీస్ లైన్స్, మీడియా మాస్టర్స్, సిరి కార్పొరేట్ మిసైల్స్ అని ఏడు టీములు ఈ లీగ్ ద్వారా పరిచయం కానున్నాయి.
క్రీడల ద్వారా యువతను సానుకూల దిశగా తీసుకెళ్లడమే ECL ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగాలని కోరారు.

