Anagani satyaprasad: స్వర్ణాంధ్ర విజన్-2047ను ముందుకు తీసుకెళ్లేందుకు పీ-4 కార్యక్రమం: మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా నిర్వహించిన డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (DVAPU) పీ-4 కార్యక్రమంపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు” అని వెల్లడించారు.
జీరో పావర్టీ లక్ష్యంగా ముందుకు “రాష్ట్రాన్ని జీరో పావర్టీ (ఎల్లవేళలా దారిద్య్రం లేని సమాజం) వైపు నడిపించేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం” అని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ ప్రణాళికల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వ్యవసాయం, పరిశ్రమలకు ప్రాధాన్యం వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సర్వీసులలో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. తిరుపతి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
బంగారు కుటుంబాలకు లక్ష్యబద్ధ సహాయం పీ-4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించి, ఆగస్టు 15వ తేదీలోపు వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మార్గదర్శకులను గుర్తించి, వారి ద్వారా ఈ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైందన్నారు.
ప్రతి నియోజకవర్గానికి అనుసంధాన కార్యకర్తలు ఈ కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అనుసంధాన కార్యకర్తలను నియమిస్తామని ప్రకటించారు. ప్రజల అభిప్రాయాలను సమీకరిస్తూ, ప్రతి ఇంటికీ చేరేలా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మామిడి రైతులకు సహాయం “2018లో తెలుగుదేశం ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకుంది. ఇప్పుడు కూడా తోతాపురి మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ అందిస్తున్నాం” అని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.