America: ఉటా పండుగలో మళ్లీ తుపాకీ హింస – పసికందుతో సహా ముగ్గురు మృతి

America: అగ్రరాజ్యం అమెరికా మరోసారి తుపాకీ హింసతో ఉలిక్కిపడింది. ఉటా రాష్ట్రంలో జరిగిన ఓ పండుగ వేడుకలు రక్తపాతంగా మారాయి. ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో పసికందుతో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన తుపాకీ కల్చర్‌పై అమెరికాలో మళ్లీ తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే, ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీలో ఉన్న సెంటెనియల్ పార్క్‌ వద్ద ఆదివారం రాత్రి ‘వెస్ట్‌ఫెస్ట్‌’ పేరిట జరుగుతున్న వార్షిక కార్నివాల్‌ సందర్భంగా ఈ కాల్పులు జరిగాయి. కార్నివాల్‌ సందడిలో ఉన్న సమయంలో, రైడ్‌ల సమీపంలో ఈ బీభత్సం చోటుచేసుకుంది. దీనిని వెస్ట్ వ్యాలీ సిటీ పోలీసులు ధృవీకరించారు. “వెస్ట్‌ఫెస్ట్‌ కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. పలువురు గాయపడ్డారు,” అని వారు తమ అధికారిక ఎక్స్ ఖాతా (మునుపటి ట్విట్టర్)లో పేర్కొన్నారు.

ఈ ఘటనలో 8 నెలల పసికందు ఎజ్రా పంతలియోన్‌, 20 ఏళ్ల పాల్ తాహి, 21 ఏళ్ల ఏంజెలికా చావెజ్‌ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరు ముప్పు తప్పినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రాథమికంగా ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, ఇద్దరు వర్గాల మధ్య ఉన్న పాత పరస్పర విరుద్ధతల వల్లే ఈ కాల్పులు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇది గ్యాంగ్‌ల మధ్య జరిగిన ప్రతీకార చర్యగా ఉండవచ్చని విచారణలో స్పష్టమవుతోంది. “ఇది స్పష్టంగా లక్ష్యిత దాడి. ఉద్దేశపూర్వకంగా కొందరిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు,” అని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇటీవలి కాలంలో అమెరికాలో ఫిలడెల్ఫియా, బాల్టిమోర్ నగరాల్లోనూ సామూహిక కాల్పులు జరిగాయి. ఇప్పుడు ఉటాలో జరిగిన ఈ ఘటన తుపాకీ హింస పునరావృతాన్ని మరోసారి దేశానికి గుర్తుచేసింది. పౌరుల భద్రత, తుపాకీల నియంత్రణపై అమెరికాలో మళ్లీ తీవ్రమైన చర్చ మొదలైంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Baba Siddique Murder Case: నిర్లక్ష్యమే..బాబా సిద్ధిక్ హత్య కు దారితీసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *