America: అమెరికా దేశంలో వరుస ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఆధునిక పోకడలతో అత్యాధునిక సౌకర్యాలతో అలరారే అగ్రరాజ్యమైన అమెరికాలోనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. దీంతో అక్కడ విమానాల్లో ప్రయాణించేందుకే ప్రజలు జంకుతున్నారు. ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదాల్లో సుమారు 80 మంది వరకు చనిపోవడం విషాదకరం.
America: తాజాగా అమెరికాలోని ఆరిజోనా స్కాట్‌డేల్ విమానాశ్రయంలో రెండు ప్రైవేటు జెట్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 10న మధ్యాహ్నం 2.45 గంటలకు లియట్ జెట్ 35ఏ విమానం ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్‌వేపై దిగుతుండగా విమానం జారింది. ఈ క్రమంలోనే రన్‌వేపై ఉన్న మరో బిజినెస్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ జీ200ను ఢీకొన్నది.
America: ఈ ఘటన జరగ్గానే విమానాశ్రయ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక కారణాలతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
America: అమెరికా దేశంలో గత 10 రోజుల కాలంలోనే వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. తాజా ఘటన నాలుగోది కావడం గమనార్హం. జనవరి 29న వాషింగ్టన్ డీసీ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌర విమానం గాల్లో ఉండగానే ఢీకొన్నాయి. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండూ అక్కడి ఓ నదిలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన మూడు రోజులకే ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో మరో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. 10 మందితో ప్రయాణిస్తున్న మరో విమానం అదృశ్యమై జాడ దొరకలేదు. తాజా ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ ఘటనలతో అమెరికా ప్రజలు భీతిల్లిపోతున్నారు.

