Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో, గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కీలక తీర్పునిచ్చింది. ఆదివారం రాత్రి న్యాయమూర్తి జి. స్రవంతి ఈ ఉత్తర్వులను జారీ చేయడంతో, పోలీసులు ఆయనను కడపటి సమాచారం మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ వివాదానికి బీజం జనవరి 31న గుంటూరులోని గోరంట్ల వద్ద పడింది. వైసీపీ చేపట్టిన ‘పాప ప్రక్షాళన’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటి రాంబాబు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అంబటి, ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిరసనగా అంబటి ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడటమే కాకుండా, నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో గుంటూరు జిల్లాలో శాంతిభద్రతల సమస్య తలెత్తింది.
Also Read: Tirumala: శ్రీవారి ఆలయం వద్ద సరికొత్త టెక్నాలజీ
ఈ ఘటనపై స్పందించిన నల్లపాడు పోలీసులు అంబటిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో పాటు, విధుల్లో ఉన్న పోలీసులను దూషించినందుకు ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శనివారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి 8:45 గంటల సమయంలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదులు అంబటి రాంబాబుపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయనను విడుదల చేస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు.
మరోవైపు, న్యాయమూర్తి ముందు తన వాంగ్మూలం ఇస్తూ అంబటి రాంబాబు భావోద్వేగానికి లోనయ్యారు. పోలీసులు తనను రాత్రి సమయంలో శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చట్టపరమైన సహాయం అందకుండా అడ్డుకున్నారని, కనీసం తనను కలవడానికి వచ్చిన వారిని కూడా అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. అయితే, సీఎంపై చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలించిన న్యాయమూర్తి, ఈ నెల 13వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించారు. తనను రాజమండ్రి జైలుకు పంపాలని అంబటి చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.
