Amaravati: పేకాట నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మూడు క్లబ్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్‌లు 13 కార్డ్స్ పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు, డబ్బులు పెట్టి పేకాట ఆడటానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. డబ్బులతో పేకాట ఆడటం చట్ట విరుద్ధమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. వినోదం పేరుతో అయినా సరే, డబ్బులు పెట్టి ఆడే పేకాటను చట్టం అనుమతించదని పేర్కొంది.
అదే సమయంలో, పేకాటను నైపుణ్య ఆటగా పేర్కొంటూ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. డబ్బుల లావాదేవీలతో జరిగే పేకాటను జూదంగా పరిగణించాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్లను కొట్టివేస్తూ క్లబ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా క్లబ్‌లలో డబ్బులతో జరిగే పేకాట కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశముందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
