Crime News: నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెళ్లయి ఆరు నెలలు కూడా గడవకముందే, కడుపులో ఎదుగుతున్న తమ రక్తపు ఆనవాళ్లను కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తించాడు. అనుమానం అనే పైత్యం తలకెక్కి.. నిండు గర్భిణి అని కూడా కనికరించకుండా భార్యను గొంతు నులిమి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో వెలుగుచూసింది. మొదట ప్రమాదవశాత్తు జరిగిందంటూ నాటకమాడిన నిందితుడు.. పోలీసుల దర్యాప్తులో అసలు విషయాన్ని బయటపెట్టాడు.
పెళ్లయిన నాటి నుంచే మొదలైన అనుమానం..
అల్వాల్ సూర్యనగర్‌కు చెందిన పరశురామ్ అనే యువకుడికి శివానితో ఆరు నెలల క్రితం వివాహమైంది. పరశురామ్ నగరంలో ర్యాపిడో (Rapido) డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయిన కొద్దిరోజులకే శివాని గర్భం దాల్చింది. అయితే, భార్యపై వికృతమైన అనుమానం పెంచుకున్న పరశురామ్ తరచూ ఆమెతో గొడవపడేవాడు.
మద్యం మత్తులో ఘాతుకం – కట్టుకథ అల్లిన భర్త..
శివాని మృతిపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మెడపై ఉన్న గాయాలను గమనించిన పోలీసులకు అనుమానం వచ్చింది. పరశురామ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. తానే స్వయంగా గొంతు నులిమి చంపినట్లు నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
