Sky Force: ఏరియల్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఇటీవల కాలంలో సినిమాలు చాలానే వస్తున్నాయి. గత యేడాది హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీ రిపబ్లిక్ డే కానుకగా విడుదలైంది. ఆ తర్వాత కొద్ది వారాలకే వరుణ్‌తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ వచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఈ యేడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24న అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ మూవీ రాబోతోంది. ఆదివారం దీని ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 1965లో జరిగిన ఇండో-పాక్ ఎయిర్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో అక్షయ్ కుమార్, వీర్ పహారియా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ గా నటించారు. ఈ వార్ లో కెప్టెన్ విజయ్ మిస్ అయ్యారు. అతని పాత్రనే వీర్ పోషించాడు. వీర్ భార్యగా సారా అలీఖాన్ నటించింది. పేట్రియాటిజమ్ తో పాటు యాక్షన్, సెంటిమెంట్ కు ఈ మూవీలో బాగానే చోటుందని తెలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ లోని వీఎఫ్‌ఎక్స్ పట్ల నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ‘స్కై ఫోర్స్’కు థియేటర్లలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.