Prateek Yadav

Prateek Yadav: యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ కన్నుమూత

Prateek Yadav: సమాజ్‌వాదీ పార్టీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సోదరుడైన ప్రతీక్ యాదవ్ (38) బుధవారం ఉదయం లక్నోలో కన్నుమూశారు. ఆయనకు భార్య అపర్ణ యాదవ్, ఒక కుమార్తె ఉన్నారు. ప్రతీక్ మరణవార్త తెలియగానే రాజకీయ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ప్రతీక్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధృవీకరించారు. మరణానంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీఎంయూ ఆసుపత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు.

తమ్ముడి మరణంపై అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీక్ ఎంతో సున్నిత మనస్కుడని, ఎప్పుడూ తన వ్యాపారాలు, ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపేవాడని గుర్తు చేసుకున్నారు. అయితే, ఇటీవల వ్యాపారంలో ఎదురైన కొన్ని నష్టాల వల్ల ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు అఖిలేష్ పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కలిసినప్పుడు కూడా వ్యాపారంపై దృష్టి పెట్టాలని తాను ధైర్యం చెప్పానని ఆయన మీడియాకు వివరించారు.

రాజకీయ కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రతీక్ యాదవ్ ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. విదేశాల్లో చదువుకున్న ఆయన రియల్ ఎస్టేట్, ఫిట్‌నెస్ రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లక్నోలో సొంతంగా జిమ్ నడపడంతో పాటు, వీధి కుక్కల సంరక్షణ కోసం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేసేవారు. ప్రతీక్ మరణం పట్ల సమాజ్‌వాదీ పార్టీతో పాటు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మరియు ఇతర రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *