Akhilesh yadav: యూపీ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఇండియా కూటమి ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలం ఉన్నందున, ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి ఏర్పాటుతో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ మళ్లీ పరిశీలించాలని సూచించారు. ప్రత్యర్థి బీజేపీని ఓడించేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్థానిక పార్టీలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉందని, అందువల్ల ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం మంచిదని అన్నారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ కంటే కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ బలం ఉందని పేర్కొన్నారు. బీజేపీని ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని గుర్తుచేశారు.
ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కూడా స్పందించారు. అఖిలేశ్ యాదవ్ మాటలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఆమ్ ఆద్మీ మరియు కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీలూ పరస్పర విమర్శలతో ఉత్కంఠను పెంచాయి. ఈ నేపథ్యంలో, కూటమి ఏర్పాటులో తీసుకున్న నిర్ణయాలను పాటించాలని సమాజ్వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
