Mudra Loan Scam: హైదరాబాద్‌లో ఓ ఘరానా మోసగాడు ముద్ర రుణాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకుల్ని బురిడీ కొట్టించాడు. ఈ మోసగాడు పేరు షేక్ జానీ అలియాస్ హరినాథ్ రావు. ఇతను ఇప్పటివరకు సుమారు 500 మంది చిన్న వ్యాపార మహిళల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇతను ముద్ర రుణాల పేరుతో ప్రజలను మోసం చేయడం కోసం చక్కటి ప్లాన్ వేశాడు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, రుణం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు వంటి పేర్లతో డబ్బు తీసుకుని, వారి ఆధార్, పాన్ కార్డులను సేకరించేవాడు. డబ్బు తీసుకున్న తర్వాత మొబైల్ నంబరు మార్చేసి పరారయ్యేవాడు.
నాలుగేళ్లుగా మోసాలు – చివరకు అరెస్ట్
ఈ మోసాల వరుస 2021 నుంచి సాగుతూనే ఉంది. మూడు కమిషనరేట్ ప్రాంతాల్లో అతనిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదయ్యాయి. నిజానికి ఈ షేక్ జానీ 2011లో ఉపాధి కోసం నకిరేకల్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగాలు చేశాడు కానీ జీతాలు తక్కువగా ఉండటంతో వెంటనే డబ్బు సంపాదించాలనే ఆశతో మోసాల బాట పట్టాడు.
ఇది కూడా చదవండి: Crime News: తమిళనాడులో దారుణం: ముగ్గురు కూతుళ్లను హత్య చేసి తండ్రి ఆత్మహత్య
కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన తరువాత, ప్రభుత్వ పథకాలపై వీడియోలు చూసి ముద్ర రుణాల గురించి తెలిసింది. అప్పుడు నుంచే అతను మోసం చేసే స్కెచ్ వేశాడు. షేక్ జానీ సెక్యూరిటీ గార్డు, క్లీనింగ్ ఏజెన్సీలు, చిన్న బిజినెస్‌లకు అవసరమైన రుణాలు ఇప్పిస్తానని చెప్పేవాడు.
మోసాలకు టెక్నాలజీ వినియోగం
వారి నమ్మకాన్ని పొందేందుకు నకిలీ ఫోటోలు, నెంబర్ డీపీలు వాడేవాడు. రుణం మంజూరైన తర్వాత కమీషన్ ఇవ్వాలని ముందుగానే ఒప్పందం పెట్టేవాడు. డబ్బు తీసుకునేందుకు ఏటీఎం సెంటర్ల దగ్గర వేచి ఉండి, “బంధువులు ఆసుపత్రిలో ఉన్నారు, డబ్బు పంపిస్తారు” అంటూ మాయ మాటలు చెప్పేవాడు.
తాజాగా ఒక మహిళకు కూడా ఇదే తరహాలో మోసం చేయబోతుండగా, ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాంకేతిక ఆధారాలతో అతన్ని పట్టుకొని కార్, బైక్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

