AE Nookaraju Family Case

AE Nookaraju Family Case: ఫొటోలు బయటపెడతా.. భర్తలాగే మిమ్మల్నీ చంపేస్తా.. సాదిక్ ఖాన్ కిరాతక నిజాలు..!

AE Nookaraju Family Case: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో గుండెలు పిండేసే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సాదిక్ ఖాన్ చేసిన మానసిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్న తీరు పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. ఎలాంటి తప్పూ చేయని ఒక కుటుంబం ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి నిందితుడి బెదిరింపులే ప్రధాన కారణమని పోలీసుల విచారణలో స్పష్టమవుతోంది.

రహస్య వివాహం నిలదీసినందుకే ప్రాణాలు తీసేలా వేధింపులు..
విచారణలో వెల్లడైన దిగ్భ్రాంతికర వివరాలు.. సాదిక్ ఖాన్ వేరొక యువతిని రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సౌజన్య ఆగస్టు 14న అతడిని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన సాదిక్.. సౌజన్యపై చేయి చేసుకున్నాడు. తన వివాహానికి అడ్డువస్తే “మీ కుటుంబాన్ని మొత్తం మట్టుబెడతా” అని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా, ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను నెట్టింట పెడతానని బెదిరించాడు. నీ భర్త జగదీశ్వరరెడ్డి ఎలా చనిపోయాడో చూశావు కదా.. మీకూ అదే గతి పట్టిస్తా అని భయపెట్టడంతో.. పరువు పోతుందన్న ఆవేదన, ప్రాణభయంతో నూకరాజు కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది.

ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి హత్య..

సౌజన్య మొదటి భర్త జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి వెనుక కూడా సాదిక్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. బంగారం శుద్ధి చేసేందుకు వాడే సైనైడ్‌ను సాదిక్ హైదరాబాద్‌లో సంపాదించినట్లు తేలింది. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జగదీశ్వరరెడ్డికి ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి ఇచ్చి ప్రాణాలు తీశాడనే బలమైన ఆధారాలు లభించాయి. దీంతో సైనైడ్ విక్రయించిన వారిని గుర్తించేందుకు ఒక ప్రత్యేక పోలీస్ బృందం హైదరాబాద్‌కు వెళ్లింది.

7 రోజుల కస్టడీ కోరిన పోలీసులు..

ఈ కుట్ర వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలను వెలికితీసేందుకు, హత్యకు ఉపయోగించిన ఆధారాలను సేకరించేందుకు నిందితుడు సాదిక్ ఖాన్‌ను 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కాకినాడ సర్పవరం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు కూడా న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక కుటుంబం పరువు, ప్రాణాలతో చెలగాటమాడిన ఈ కేసులో నిందితుడికి చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష పడాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *