Navya Nair: కేరళకు చెందిన ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్‌కు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం పండగ వేడుకల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె, తన హ్యాండ్ బ్యాగ్‌లో 15 సెంటీమీటర్ల మల్లె పూల మాల తీసుకెళ్లినందుకు రూ.1.14 లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
మలయాళీలకు ఓనం పండగ ఎంతో ప్రత్యేకం. ఈ సందర్భంగా మహిళలు తలలో మల్లెపూలు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు నవ్యా నాయర్ సెప్టెంబర్ 5న మెల్‌బోర్న్ చేరుకున్నారు. అయితే, ఎయిర్‌పోర్టులో ఆమె బ్యాగ్ తనిఖీ సమయంలో అధికారులు 15 సెంటీమీటర్ల మల్లెపూల మాలను గుర్తించారు. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం, విదేశీ మొక్కలు లేదా జంతువులను దేశంలోకి తీసుకెళ్లడం నిషేధం, ఎందుకంటే అవి స్థానిక జీవవైవిధ్యానికి హాని కలిగించవచ్చు. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు నవ్యాకు 1,980 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.1.14 లక్షలు) జరిమానా విధించారు.
Also Read: Ranga Sudha: ప్రముఖ నటి రంగ సుధపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
నవ్యా ఈ ఘటనను ఓనం కార్యక్రమంలో పంచుకుంటూ, “నా తండ్రి కొచ్చి నుంచి సింగపూర్ వెళ్లే ముందు మల్లెపూలు ఇచ్చారు. ఒక భాగాన్ని కొచ్చి నుంచి సింగపూర్ వరకు తలలో పెట్టుకున్నాను. మిగిలిన భాగాన్ని సింగపూర్ నుంచి మెల్‌బోర్న్ ప్రయాణంలో పెట్టుకోవడానికి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచాను. నాకు ఈ చట్టం తెలియదు, తెలియక చేసిన తప్పు. అయినా, అజ్ఞానం సమర్థనీయం కాదు. 15 సెంటీమీటర్ల పూలమాల కోసం రూ.1.14 లక్షల జరిమానా చెల్లించమన్నారు. ఈ మొత్తాన్ని 28 రోజుల్లో చెల్లించాలి,” అని వివరించారు. ఈ సంఘటనను ఆమె తేలిగ్గా తీసుకుంటూ, “నేను లక్ష రూపాయల విలువైన మల్లెపూలు ధరించాను,” అని హాస్యంగా వ్యాఖ్యానించారు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

