Actress Hema: గతంలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సినీ నటి హేమ, ఆ కష్ట కాలంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదనను తాజాగా వెల్లడించారు. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆ కేసును కొట్టివేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూనే, ఆ సమయంలో తాను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. 2021లో బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీ కేసులో నటి హేమపై మాదకద్రవ్యాలు సేవించారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి.
ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. కాగా, ఈ కేసును ఇటీవల కర్ణాటక హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో హేమకు ఈ ఆరోపణల నుంచి ఊరట లభించింది. కేసు కొట్టివేసిన తర్వాత మీడియా ముందు మాట్లాడిన హేమ, ఆరోపణలు వచ్చిన సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడిని వివరించారు. ఆ డ్రగ్స్ కేసు ఆరోపణలు వచ్చిన సమయంలో, నాకు రోజుకు సుమారు 500 ఫోన్‌కాల్స్ వచ్చేవి. నేను ఏమి మాట్లాడుతున్నానో, ఎవరికి సమాధానం ఇవ్వాలో అర్థం అయ్యేది కాదు అని హేమ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: SP Balasubrahmanyam: తెలంగాణలో ఆంధ్రుల విగ్రహం పెట్టకూడదు.. ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై తీవ్ర వివాదం
ఆ ఫోన్‌కాల్స్‌లో ఎక్కువ భాగం మీడియా, పరామర్శలు, విమర్శలకు సంబంధించినవే ఉండేవని, అవి తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయని ఆమె తెలిపారు. తప్పుడు ఆరోపణల కారణంగా తన కుటుంబం, కెరీర్ ఎంతగానో దెబ్బతిన్నాయని హేమ వాపోయారు. చివరికి న్యాయమే గెలిచిందని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కోర్టు తీర్పుతో స్పష్టమైందని హేమ పేర్కొన్నారు. ఈ కేసు వల్ల తాను అనుభవించిన వేదనను ఎవరూ అర్థం చేసుకోలేరని హేమ కన్నీటి పర్యంతమయ్యారు.

