Shivaji: నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి తన ప్రసంగంలో దొర్లిన కొన్ని అనుచిత పదాలపై బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎప్పుడూ ఇలాంటి అసభ్య పదజాలం వాడలేదని, ఆ సమయంలో తాను నిద్రలేక అలసటలో ఉండటం వల్ల తెలియకుండానే ఆ మాటలు వచ్చాయని ఆయన వివరణ ఇచ్చారు.
తాను అభ్యంతరకర పదాలు వాడటం తప్పేనని ఒప్పుకుంటూనే, తన ఉద్దేశం (స్టేట్మెంట్) మీద మాత్రం వెనక్కి తగ్గేది లేదని శివాజీ స్పష్టం చేశారు. ఇటీవల లులూ మాల్లో నటి నిధి అగర్వాల్ బహిరంగంగా ఎదుర్కొన్న చేదు అనుభవం, అలాగే సమంతపై జరిగిన కొన్ని వేధింపులు తన మనసును కలిచివేసినట్లు తెలిపారు. హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలనే బాధ్యతతోనే ఆ మాటలు అన్నానని, వారిని రక్షించుకోవాలనేదే తన అసలు ఇంటెన్షన్ అని పేర్కొన్నారు. ఒకవేళ పొరపాటున దుస్తులు జారితే ఆ వీడియోలు ఇంటర్నెట్లో జీవితాంతం ఉండిపోయి వారిని వేధిస్తాయనే ఆందోళన తనలో ఉందన్నారు.
Also Read: Union Cabinet: ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
శివాజీ వ్యాఖ్యలపై అటు గాయని చిన్మయి, ఇటు నటి అనసూయతో పాటు పలువురు మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఈ వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై స్పందిస్తూ, “ఈ నెల 27న మహిళా కమిషన్ ముందు హాజరై నా వివరణ ఇస్తాను, అవసరమైతే క్షమాపణ లేఖ కూడా ఇస్తాను” అని ఆయన తెలిపారు. అయితే, ‘మా’ (MAA) అసోసియేషన్ సభ్యులు గానీ, ఇతర సినీ పెద్దలు గానీ తనతో నేరుగా మాట్లాడి వివరణ కోరకుండానే ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేయడంపై ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సుప్రియ గారు మాత్రమే తనకు ఫోన్ చేశారని, ఆమెకు కూడా తాను క్షమాపణ చెప్పానని వెల్లడించారు.
నటి అనసూయ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైనా శివాజీ స్పందించారు. “అనసూయ గారు.. మీరు ఈ విషయంలోకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. నాకు మీ వల్ల ఇన్ సెక్యూరిటీ (అభద్రతా భావం) ఉందని అన్నారు.. దానికి ధన్యవాదాలు” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మొత్తం వివాదంలో తన వల్ల తన కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, తప్పు జరిగినట్లు గ్రహించిన వెంటనే మొదట తన భార్యకు, కొడుకుకు క్షమాపణలు చెప్పానని ఆయన వివరించారు. చివరగా, సమాజంలో ఏ తప్పు జరిగినా దానికి సినిమాలే కారణమనే విమర్శలు వస్తున్నాయని, ఆ ముద్ర పోగొట్టాలనే ఆవేశంలోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని శివాజీ చెప్పుకొచ్చారు.
