Rajendra Prasad: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ నటుడు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఇటీవల భారత ప్రభుత్వం రాజేంద్రప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన రాజేంద్రప్రసాద్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు రాజేంద్రప్రసాద్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కొనియాడారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా, భావోద్వేగపూరితమైన పాత్రలు, కుటుంబ కథా చిత్రాలు, సామాజిక ఇతివృత్తం ఉన్న సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. తెలుగు సినిమా గౌరవాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రాజేంద్రప్రసాద్ కృషి ఎంతో ఉందన్న ముఖ్యమంత్రి, ఆయనలోని వినయం, నైతిక విలువలు నేటి యువతరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
Also Read: Mega 158: మెగా 158లో దురంధర్ బ్యూటీ?
భారత ప్రభుత్వం సరైన సమయంలో రాజేంద్రప్రసాద్ ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం తెలుగు వారందరికీ గర్వకారణమని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించి, మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
