Prakash Raj: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR – స్పెషల్ సమ్మరీ రివిజన్) ప్రక్రియపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి “గణేష్ నిమజ్జనం పూర్తయింది.. ఇప్పుడు ఎన్నికల అధికారి జ్ఞానేష్ విసర్జనం కావాలి!” అంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.
ఎన్నికల సంఘం ఏర్పడిన నాటి నుంచి ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సహజంగా జరుగుతుంటాయని, కానీ ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్ పేరుతో ఇంత హడావుడిగా ఎస్ఎస్ఆర్ (SSR)ను ఎందుకు రుద్దుతున్నారని ఆయన నిలదీశారు. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలు బలపడ్డాయని ఆరోపించారు.
నేను ఓటరునని ఎలా నిరూపించుకోవాలి?..
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమానమైన ఓటు హక్కు ఉండాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, నెహ్రూ లాంటి మహనీయులు పోరాడారని చెప్పారు.
ఆధార్ కాదంటే ఏ పేపర్ చూపించాలి?
“నేను భారత పౌరుడినని, నాకు ఓటు హక్కు ఉందని నేను ఎలా నిరూపించుకోవాలి? ఓటు కోసం ఆధార్ కార్డు గుర్తింపు కాదంటున్నారు.. మరి ఇంకేం పేపర్ చూపించాలి? ట్రాన్స్‌జెండర్లకు ఇళ్లు ఉండవు, కుటుంబ గుర్తింపులు ఉండవు.. మరి వాళ్లు ఏ పత్రాలు చూపించి ఓటు హక్కు తెచ్చుకోవాలి? అసలు ఎవరు ఓటు వేయాలనేది రాజకీయ పార్టీలు డిసైడ్ చేస్తాయా?” అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
14 రాష్ట్రాల్లో సర్ పూర్తయ్యాకే బండారం బయటపడింది..
దాదాపు 14 రాష్ట్రాలలో ఈ ప్రక్రియ ముగిశాకే అసలు కుట్ర వెలుగులోకి వచ్చిందని, ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు లక్షలాది ఓట్లను తొలగించడం దారుణమని మండిపడ్డారు. ఓట్లు గల్లంతైన వారికి “వచ్చేసారి ఓటు వేసుకోండి” అంటూ కోర్టులు తీర్పులు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఇదే తరహా సవరణల ప్రక్రియతో పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని మార్చేసే కుట్రలు జరిగాయని ఆరోపించారు.
స్వచ్ఛ భారత్ పబ్లిసిటీకి పెట్టిన దాంట్లో పదో వంతు కూడా లేదు..
ఎన్నికల సంఘం తీరును ఆయన తూర్పారబట్టారు. ప్రధానమంత్రి మోదీ ‘స్వచ్ఛ భారత్’ ప్రచారానికి పెట్టిన ఖర్చు కంటే కూడా ఈ ఓటర్ల సవరణ (SSR) అవగాహన కోసం పెట్టిన ఖర్చు చాలా తక్కువని విమర్శించారు. సామాన్య ప్రజలకు తమ ఓటు తొలగింపు గురించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు.
సిబ్బంది లేరు – విచారణకు ఒప్పుకోరు..
ఎన్నికల సంఘం దగ్గర క్షేత్రస్థాయిలో సరైన సిబ్బంది లేరని, ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియను పూర్తి చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైనా పకడ్బందీగా చేయమని కోరినా వినలేదన్నారు. కనీసం వంద బూత్‌లలోనైనా అధికారులు నిష్పాక్షిక విచారణ జరిపి నిజాలు తేల్చాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
13 నుంచి 17 కోట్ల ఓట్ల గల్లంతు – బీజేపీ ఆఫీసుల నుంచే లిస్టులు”
ఓట్ల తొలగింపు వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. పలు నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా 13 కోట్ల నుంచి ఏకంగా 17 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, ఒక చోట నుంచి మరో చోటుకు మారితే ఇంత భారీ వ్యత్యాసం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారికి ఫామ్-6 ఇవ్వమనడం వెనుక అర్థం లేదని, ఫామ్-6 అనేది కొత్తగా ఓటు నమోదు చేసుకునే యువత కోసమేనని గుర్తుచేశారు.
దేశంలో దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీల ఓట్లను పథకం ప్రకారమే తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎవరి ఓట్లు ఉంచాలి, ఎవరి ఓట్లు తీసేయాలనే లిస్టులు నేరుగా బీజేపీ ఆఫీసుల నుంచే ఈసీకి వెళ్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోర్టులకు వెళ్లకుండా చట్టాలు..
“జ్ఞానేష్ కుమార్ తీసుకునే వివాదాస్పద నిర్ణయాలపై ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లకుండా ముందే పక్కా వ్యూహంతో కొత్త చట్టాలు తెచ్చారు. జ్ఞానేష్ కుమార్ వెనుక ఉంది మరెవరో కాదు.. ఆ బిల్లా రంగాలే (మోదీ, అమిత్ షా). ఒకేసారి ముగియాల్సిన సాధారణ ఎన్నికలను 6 నుంచి 7 విడతలుగా షెడ్యూల్ చేసి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీశారు. దేశంలో మనుస్మృతి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు” అని మండిపడ్డారు. మిగతా ఇద్దరు కమిషనర్లు భిన్నాభిప్రాయం చెబితే.. ఒక్క జ్ఞానేష్ చెప్పిందే వేదమా అని ప్రశ్నించారు.
కూటమి నేతలకు సూచన..
బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే ఈసీ నిర్ణయాలకు గుడ్డిగా మద్దతిస్తున్నారని విమర్శించారు. “చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాజ్యాంగం, ప్రజల వైపు నిలబడతారో.. లేక ఈ అక్రమ ఎన్నికల కమిషన్ వైపు ఉంటారో వాళ్లే తేల్చుకోవాలి” అని హితవు పలికారు. దేశంలో 13 కోట్ల మందికి పైగా ఓటర్ల ప్రాథమిక హక్కు ప్రమాదంలో పడిందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు.
