Formula E- Car Race Case: ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ2గా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జులై 1న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ప్రస్తుతం అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్నారు. ఈ నెలాఖరు వరకు ఆయన తిరిగి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో గత జనవరిలోనే ఏసీబీ, ఆ తర్వాత ఈడీ విచారించింది. ఈ క్రమంలో ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ ను ఏసీబీ మరోసారి విచారించింది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులు వెలువడటం ఆసక్తిగా మారింది.
గతంలో అరవింద్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా గత వారం కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్లు, స్పాన్సర్లు, ఆర్థిక శాఖ అనుమతులు ఇలా వివిధ అంశాలపై కేటీఆర్ నుంచి కీలక సమాచారం రాబట్టిన దర్యా్ప్తు అధికారులు ఈసారి కేటీఆర్ చెప్పిన సమాధానాల ఆధారంగా అరవింద్ కు ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. అవసరం మేరకు కేటీఆర్, అరవింద్ ను ఉమ్మడిగా విచారించే అవకాశాలు సైతం ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజా నోటీసులతో ఈ కేసులో ఏం జరగబోతున్నది అనేది ఆసక్తి రేపుతున్నది. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ వ్యవహారం, ఒప్పందాలు అన్ని తానై కేటీఆర్ వ్యవహరించారని గతంలో అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సారి దర్యాప్తులో ఆయన చెప్పబోయే విషయాల ఆధారంగా కేటీఆర్ అరెస్టు ఏదైనా ఉండబోతున్నదా అనేది సస్పెన్స్ గా మారింది.