Abhijeet Dipke: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం ఇప్పుడు నిరసనలకు దారితీస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేటి నుంచి ఒక భారీ నిరసన ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికాలోని బోస్టన్ నగరం నుండి నేరుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తాను జూన్ 6న ఇండియాకు వచ్చి శాంతియుత పోరాటం చేస్తానని ఆయన ముందే ప్రకటించారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే అభిజీత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ ద్వారా విద్యార్థులకు, ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. “నేను ఢిల్లీ చేరుకున్నాను. జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీతో పాటు ఒక పుస్తకాన్ని, మన జాతీయ జెండాను తీసుకురావడం మర్చిపోకండి. అలాగే మనకు రక్షణగా ఉండే పోలీసులకు కృతజ్ఞతగా పూలను బహుమతిగా ఇవ్వండి. ఈ పోరాటాన్ని మనం శాంతి, ప్రేమ మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్లాలి” అని ఆయన పోస్ట్ చేశారు. కాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి జూన్ 5 లోగా రాజీనామా చేయకపోతే తాను కూడా ఈ నిరసనలో పాల్గొంటానని ప్రముఖ విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్చుక్ ఇదివరకే ప్రకటించడం ఈ ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చింది.
మరోవైపు, ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నుండి తమకు ఎలాంటి ముందస్తు అనుమతి దరఖాస్తు రాలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ, జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,000 మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనకారులతో గొడవలకు దిగకుండా, కేవలం చర్చల ద్వారానే పరిస్థితిని అదుపులోకి తేవాలని ఉన్నతాధికారులు తమ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని 12 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక డీసీపీ (DCP) ర్యాంక్ అధికారిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నిరసనల కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
