Karimnagar: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. కోతుల గుంపు చేసిన హడావుడి ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంటి ముందు కోతులు స్వైరవిహారం చేస్తుండటంతో, అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయోనన్న భయంతో అప్రమత్తమైన ఒక మహిళ ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల (59) అనే మహిళ బుధవారం ఉదయం తన ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కోతుల గుంపు ఇంటి ముందు వచ్చి బీభత్సం సృష్టించాయి. అవి ఇంట్లోకి చొరబడతాయేమో లేదా తనపై దాడి చేస్తాయేమోనని విమల భయాందోళనకు గురయ్యారు. వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టే క్రమంలో ఆమె హడావుడిగా కదలడంతో కాలు జారి ఇంటి ముందున్న గచ్చు నేలపై ఒక్కసారిగా పడిపోయారు.
ఈ ప్రమాదంలో ఆమె తలకు చాలా బలమైన గాయం తగిలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు మరియు స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హుజురాబాద్‌లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూశారు. విమల మరణంతో లింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
గ్రామాల్లో కోతుల బెడద ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన మరోసారి అద్దం పడుతోంది. కోతుల గుంపులు జనావాసాలపై పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
