Warangal

Warangal: విధి ఆడిన వింత నాటకం.. రోడ్డు ప్రమాదంలో గర్భిణి డాక్టర్ దుర్మరణం

Warangal: వరంగల్ నగరంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ గర్భిణి డాక్టర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మమతారాణి అనే మహిళా వైద్యురాలు హంటర్ రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నారు. గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణిగా ఉన్నారు.

సోమవారం రాత్రి మమతారాణి తన భర్తతో కలిసి డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరారు. వారు ఏడు మోరీల కూడలి వద్దకు చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన మమతారాణిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. పుట్టబోయే బిడ్డతో పాటు తల్లి కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిండు గర్భిణిగా ఉండి, సమాజానికి సేవ చేస్తున్న ఒక వైద్యురాలు ఇలా అర్ధాంతరంగా మరణించడం స్థానికులను కలచివేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *