Vikarabad: వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామంలో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురే, వారి ప్రాణాలు తీయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. నిందితురాలు నక్క సురేఖ ఒక నర్సింగ్ హోంలో నర్స్‌గా పనిచేస్తోంది. వృత్తిరీత్యా ప్రాణాలు కాపాడాల్సిన చేతులతోనే, తన ప్రేమకు అడ్డుపడుతున్నారని కన్నతల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా చంపేసింది.
సురేఖకు రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, వీరిద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో సురేఖ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ససేమిరా అన్నారు. తమ కూతురు భవిష్యత్తు కోసం వారు చెప్పిన మాటలను సురేఖ పెడచెవిన పెట్టడమే కాకుండా, వారిని తన ప్రేమకు అడ్డుగోడలుగా భావించింది. ఎలాగైనా వారిని అడ్డు తొలగించుకోవాలని ఒక క్రూరమైన ప్లాన్ వేసింది.
తను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుండి అనస్థీషియా ఇంజెక్షన్లను దొంగతనంగా తెచ్చింది. తల్లిదండ్రులకు ఒళ్లు నొప్పులుగా ఉందని చెప్పి, నమ్మించి వారికి మత్తు మందును అధిక డోసేజ్‌లో ఇంజెక్ట్ చేసింది. తీవ్రమైన మత్తు ప్రభావంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా తన అన్నకు ఫోన్ చేసి, తల్లిదండ్రులు సహజంగానే చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే, తల్లిదండ్రులు ఒక్కసారిగా మరణించడంపై అనుమానం వచ్చిన అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సురేఖను తమదైన శైలిలో విచారించగా, అసలు నిజం బయటపడింది. తానే స్వయంగా ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లు ఆమె అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి సురేఖను అదుపులోకి తీసుకున్నారు.
