Rakesh Roshan: బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఈ నెల 21తో పాతికేళ్ళు పూర్తవుతోంది. అతను నటించిన మొదటి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ను హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ సమయంలో బాలీవుడ్ మీద అండర్ వరల్డ్ డాన్స్ ప్రభావం బాగా ఉండేది. ఏ హీరోతో నిర్మాతలు సినిమాలు తీయాలి, ఏ హీరోయిన్ ను పెట్టుకోవాలి అనేది కూడా వారే నిర్ణయించేవారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కనుసన్నలలోనే అగ్ర నిర్మాతలూ నడిచేవారు. అయితే హృతిక్ రోషన్ డేట్స్ ను కూడా తామే చూస్తామని అండర్ వరల్డ్ వర్గాలు చేసిన డిమాండ్ ను రాకేష్ రోషన్ తిరస్కరించారు.
అండర్ వరల్డ్ అడుగులకు మడుగులొత్తే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. దాంతో ఆయనమీద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్స్ ఆయన శరీరంలోకి దూసుకెళ్ళాయి. ఆ తర్వాత కోలుకుని సినిమాలు చేశారు. ఈ వివరాలన్నీ ‘ది రోషన్స్’ డాక్యుమెంటరీలో పొందు పరిచారు దర్శకుడు శశి రంజన్. హృతిక్ రోషన్, అతని తండ్రి రాకేశ్ రోషన్, ఆయన తండ్రి రోషన్ లాల్ నగ్రత్ చిత్రసీమకు అందించిన సేవల నేపధ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఈ నెల 17న ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. రోషన్ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని సినిమా ప్రముఖులు ఈ డాక్యుమెంటరీ లో వివరించారు.