Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రెండేళ్ల పాలన ప్రజలకు మొండిచేయి చూపిందని, కేవలం ఆగమాగంగా సాగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, తొలి రెండేళ్ల పాలన గీటురాయి లాంటిది అవుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమయాన్ని నిస్పారం, నిరర్ధకంగా చేసిందని ఎత్తిచూపారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చిందని గుర్తుచేస్తూ, ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఇచ్చిన ‘ప్రజా దర్బార్’ హామీని కూడా సరిగా అమలు చేయలేకపోతుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పాలనలో ఆత్మస్తుతి, పరనింద తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మెట్రో రైలు, ఫార్మా సిటీ వంటి ముఖ్యమైన పథకాలను రద్దు చేయడమే కాకుండా, రాష్ట్ర ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని, అపజయోత్సవాలు అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు అడిగిన వారికి విజిలెన్స్ విచారణలు, ఏసీబీ దాడులు చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. “రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే, నేను రాజీనామా చేయడానికి సిద్ధం! మీరు సిద్ధమా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. రైతుల పరిస్థితిని ప్రస్తావిస్తూ, 50 రోజులు గడిచినా వడ్లు కొన్న పైసలు ఇంకా వేయలేదని, రైతులను బేడీలు వేయించిన ప్రభుత్వం కాంగ్రెస్ అని, ఇది రైతు సంక్షోభ ప్రభుత్వం అని విమర్శించారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడం మానేసి, మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, తాగుబోతుల తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇతర అంశాలపై స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన చోట పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం క్లియర్ అవుతున్నాయని, ఇప్పటివరకు దాదాపు 18 వేల కోట్ల బిల్లులు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ విషయంపై తాను చర్చకు కూడా సిద్ధమని హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించేది గ్లోబల్ సమ్మిట్ కాదని, అది గోబెల్స్ సమ్మిట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో దావోస్ పర్యటనలో డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని గుర్తుచేశారు. గ్లోబల్ సమ్మిట్‌కు కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన భూమిలో రేవంత్ రెడ్డికి చెమట చుక్క లేదు, ఆలోచన లేదు అని, ఉద్యోగాల కోసం కేసీఆర్ ఆలోచన చేస్తే, ఆ భూములను రేవంత్ రెడ్డి తన అనుయాయులకు పప్పు బెల్లం మాదిరిగా పంచిపెడుతున్నారని విమర్శించారు. మొదటి ఏడాది పాలనతో పోలిస్తే, రెండో ఏడాది రేవంత్ పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు అయిందని, మూడో ఏడాది పాలన ఎలా ఉంటుందో చూడాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
