Satyavardhan Kidnap Case: విజయవాడలో దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉండిపోయిన ప్రధాన నిందితుడు కొమ్మా కోట్లు చివరకు వెలుగులోకి వచ్చాడు. పటమట పోలీస్ స్టేషన్‌కు స్వయంగా హాజరై లొంగిపోవడంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ నేత వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడైన కోట్ల పేరు చాలా కాలంగా వినిపిస్తోంది.
తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌ను బెదిరించి, కేసు ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి తెచ్చేందుకు వంశీ అనుచరులు కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌కు తీసుకెళ్లడం, అక్కడినుంచి విజయవాడకు తిరిగి తరలించడం వంటి కార్యక్రమాల్లో కోట్ల పాత్ర కీలకమని దర్యాప్తు అధికారుల సమాచారం. ఈ కేసులో వంశీ ఏ1, కోట్లు ఏ2 నిందితులుగా ఉన్నారు.
వంశీ అరెస్ట్ అయిన తర్వాత కొమ్మా కోట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా అతని కోసం పోలీసులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ల నేపథ్యంలో, అతను మరింత ఒత్తిడికి గురయ్యాడనే సమాచారం. చివరకు లొంగిపోయడమే మార్గమని భావించిన కోట్లు, పటమట పీఎస్‌కు వచ్చి తనను తాను అధికారులకు అప్పగించాడు.
Also Read: Telangana Rising Global Summit: నేడే ప్రారంభం.. ఫ్యూచర్ సిటీకి చేరుకుంటున్న ప్రపంచ ప్రతినిధులు
లొంగిపోయిన వెంటనే పోలీసులు అతన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కోట్లు మీడియాతో మాట్లాడిన సందర్భంగా తనపై మోపిన ఆరోపణలను ఖండించాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో తాను ఎటువంటి పాత్ర పోషించలేదని, తనపై అనవసరంగా కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చాడు. కోర్టు నుంచి తాను న్యాయం పొందుతాననే నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.
ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఇప్పటికే లొంగిపోయారు. ఎర్రంశెట్టి రామాంజనేయుల అరెస్ట్, రాము–వజ్రకుమార్ కోర్టులో ఆత్మసర్పణ తర్వాత కోట్ల లొంగిపోవడం కేసు దర్యాప్తును వేగవంతం చేస్తోంది. మరోవైపు, సత్యవర్ధన్‌ను బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలతో వంశీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. జైలులో అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొని బెయిల్‌పై బయటకు వచ్చిన వంశీ ఇప్పుడు మళ్లీ ఈ కేసుతో ఇరుక్కున్న పరిస్థితి. కొమ్మా కోట్ల అరెస్టుతో ఈ కేసు మరింత వేగంగా ముందుకు సాగనుందని పోలీసులు తెలిపారు. విచారణలో ఇంకా కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
