Harish Rao: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి క్లిష్టమైన విధుల్లో నిరంతరం పనిచేస్తున్న సుమారు 15 వేలకు పైగా హోంగార్డులకు రైజింగ్‌డే శుభాకాంక్షలు. అయితే, ఈ శుభాకాంక్షల వెనుక వారి కుటుంబాల కష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న తీవ్రమైన వంచన కళ్ళ ముందు కనబడుతోంది.
నిజంగా చెప్పాలంటే, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హోంగార్డుల సేవలను గుర్తించి, వారి ఆత్మగౌరవాన్ని పెంచింది. 2014లో కేవలం రూ.9,000గా ఉన్న వారి నెలవారీ వేతనాన్ని భారీగా రూ.27,600కు పెంచింది. అంతేకాదు, ట్రాఫిక్‌లో పనిచేసే వారికి 30% రిస్క్ అలవెన్స్, మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి సంక్షేమ బాట పట్టింది. విధి నిర్వహణలో మరణిస్తే రూ.5 లక్షల బీమా, కార్యక్రమ నిర్వహణ ఖర్చులను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. బీఆర్‌ఎస్ ఏటా సుమారు రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసి వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితాన్నిచ్చింది.
రూ.79 పెంచి… నయవంచన చేస్తున్న కాంగ్రెస్!
అధికారంలోకి రాకముందు ‘అభయహస్తం’లో ఎన్నో గొప్ప హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్… ప్రస్తుతం హోంగార్డుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోజువారీగా ఇచ్చిన వేతనం రూ.921కి కేవలం మరో రూ.79 కలిపి, మొత్తం రూ.1,000 చేసి “ఎంతో గొప్ప పని చేశామని” గప్పాలు కొట్టడం దారుణమైన నయవంచన. ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీలను అమలు చేయకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వికృత చేష్టలతో హోంగార్డులను తీవ్రంగా అవమానిస్తున్నారనేది స్పష్టం.
ఇది కూడా చదవండి: DK Shivakumar: నేషనల్ హెరాల్డ్ కేసులో బిగ్ ట్విస్ట్.. డీకే శివకుమార్‌కు నోటీసులు
హోంగార్డుల సమస్యలు: నెరవేరని హామీల పర్వం
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పనులు చేయించుకుంటున్న పోలీసు శాఖ, ప్రభుత్వం… వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. గత రెండేళ్ల కాలంలో దాదాపు 60 మందికి పైగా హోంగార్డులు మరణించినా, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారికి తప్ప, సహజ మరణం పొందిన ఒక్క కుటుంబానికీ రూ.5 లక్షల బీమా అందించని దుస్థితి నెలకొంది. కారుణ్య నియామకాలు, ఎక్స్ గ్రేషియా లేక హోంగార్డుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాయి.
రేవంత్ రెడ్డి హామీలు – వాస్తవ పరిస్థితి:
- 1. సహజ మరణ బీమా: జనవరి 2025లో జీ.ఓ. నెం.2 ద్వారా సహజ మరణం పొందిన హోంగార్డులకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పినా, 10 నెలలు కావస్తున్నా ఒక్కరికి కూడా పరిహారం అందలేదు.
- 2. హెల్త్ కార్డులు: హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. సకాలంలో వైద్యం అందక చాలామంది హోంగార్డులు అనారోగ్యంతో మరణిస్తున్నారు.
- 3. యూనిఫామ్ అలవెన్స్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మినహా మిగతా జిల్లాల వారికి నాలుగు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్ అలవెన్స్ ఇప్పటికీ ఇవ్వలేదు.
- 4. కారుణ్య నియామకాలు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోంగార్డు రవీందర్ కుటుంబానికి అండగా ఉంటామని, అధికారంలోకి వచ్చిన వెంటనే కారుణ్య నియామకాలు జరుపుతామని చెప్పిన మాట కలగానే మిగిలిపోయింది.
- 5. పెండింగ్ జీతాలు: సకాలంలో జీతాలు అందక, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కూడా కట్టలేక హోంగార్డుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
- 6. ఇతర సంక్షేమం: ఉద్యోగాలను పర్మినెంట్ చేయడం, వీక్లీ ఆఫ్‌లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆర్డర్లీ వ్యవస్థ రద్దు వంటి హామీలు అన్నీ గాలిమాటలుగానే మిగిలిపోయాయి.
మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేసినట్టుగానే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మొండివైఖరి వీడి, హోంగార్డులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు సేవలందిస్తున్న హోంగార్డుల బతుకులను రోడ్డుపాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
