Nadendla Manohar: రైతులకు మద్దతు ధర (MSP) గురించి మాట్లాడే నైతిక హక్కు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో జగన్ చేసిన పాలన రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం ర్యాండమైజేషన్ పద్ధతిని తీసుకొచ్చి, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆయన గుర్తుచేశారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడానికి జగన్ ప్రభుత్వం ఏకంగా తొమ్మిది నెలల సమయం తీసుకుందని, రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పిందని మనోహర్ దుయ్యబట్టారు.
Also Read: Venkaiah Naidu: తెలుగు చదివిన వారికే ఉద్యోగం ఇవ్వాలి: వెంకయ్య నాయుడు
అయితే, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు భరోసా ఇచ్చేలా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించే విధానాన్ని అమలు చేసిందని, ఇప్పటికే రూ. 3,350 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతుల విషయంలో కూడా గత ప్రభుత్వ వైఖరిని ఆయన విమర్శించారు. “మీ హయాంలో తుఫాన్లు వచ్చినప్పుడు అధికారులతో కలిసి మీరు తాపీగా రైతుల వద్దకు వెళ్లేవారు, కానీ మా ప్రభుత్వం మాత్రం నష్టపోయిన రైతులకు త్వరితగతిన భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంది” అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. మద్దతు ధర, రైతు సమస్యలపై విమర్శలు చేసే ముందు, జగన్మోహన్ రెడ్డి తన పాలనలో జరిగిన వైఫల్యాలను గుర్తుంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ హితవు పలికారు.

