Telangana

Railway Projects: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. ఐదు ప్రత్యేక ప్రాజెక్టులకు ఆమోదం

Railway Projects: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు రైల్వేశాఖ ఐదు ముఖ్య ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో మూడు ట్రాక్షన్‌ సబ్‌స్టేషన్ల సామర్థ్య పెంపుతో పాటు, కొత్త నిర్మాణాలు, రైల్‌ మార్గాల ఆధునీకరణ ఉన్నాయి. భూసేకరణ, నిర్మాణం, పర్యవేక్షణ వేగంగా జరిగేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రైల్వేశాఖ వేరు వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

సికింద్రాబాద్‌–కాజీపేట సెక్షన్‌లో రైల్వే ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మార్గంలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమైంది. ఈ నేపథ్యంలో ఘట్‌కేసర్, ఆలేరు వద్ద కొత్త ట్రాక్షన్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఈ పనులకు భూసేకరణ, పర్యవేక్షణ కోసం భువనగిరి, కీసర ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు.

పెద్దపల్లి జిల్లాలో రద్దీగా ఉండే మూడు లెవెల్‌ క్రాసింగ్‌ల స్థానంలో ఆధునిక రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ROBs) నిర్మించనున్నారు. పెద్దపల్లి–రాఘవపూర్, రాఘవపూర్–రామగుండం సెక్షన్లలోని 40, 46, 49 నంబర్ల వద్ద ఆర్వోబీలు నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. వీటి ద్వారా ట్రాఫిక్‌ ఆటంకాలు తొలగి, రైల్వే ప్రయాణం, రోడ్డు రవాణా రెండూ సౌకర్యవంతం కానున్నాయి.

Also Read: Sabarimala: శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. 10 ప్రత్యేక రైలు సర్వీసులు

అదే విధంగా, డోర్నకల్‌ జంక్షన్‌ వద్ద 10.5 కిలోమీటర్ల పొడవు గల భారీ ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ (ROR) ఫ్లైఓవర్‌ నిర్మాణానికి హరిత పతాకం పట్టింది. ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యన తర్వాత రైల్వే రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్ద ప్రాజెక్టుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామగుండం–మణుగూరు నూతన రైల్వే లైన్‌కు సూత్రప్రాయ ఆమోదం లభించింది. సుమారు ₹4,000 కోట్ల వ్యయంతో ఈ రైల్వే మార్గం నిర్మించబడనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సింగరేణి కార్మికులు, భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా కలగడమే కాకుండా, బొగ్గు రవాణా వేగవంతం అవుతుంది. పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలకు సకాలంలో బొగ్గు సరఫరా చేరడంతో ఆర్థిక కార్యకలాపాలు వేగం అందుకోనున్నాయి.

సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులకు కూడా ఈ కొత్త మార్గం ప్రత్యేక కనెక్టివిటీ కల్పించనుంది. పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల మౌలిక సదుపాయాలు మెరుగుపడి, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *