Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం రాష్ట్రంలో కీలకమైన సంస్కరణలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, విద్యుత్, విద్య రంగాలకు సంబంధించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
జీహెచ్ఎంసీ విస్తరణ
పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) ను అనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు/అర్బన్ లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. విలీనం కానున్న మున్సిపాలిటీలలో పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్ ఉన్నాయి.
Also Read: IBomma Ravi Case: పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ రవిని ఎలా పట్టుకున్నారు? సీపీ శ్రీనివాస్ వెల్లడి
విద్యుత్ రంగంలో కీలక మార్పులు
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రాబోయే పదేళ్ల విద్యుత్ అవసరాలపై క్యాబినెట్ చర్చించింది. ఈ సందర్భంగా కీలకమైన మార్పులు, నిర్ణయాలకు ఆమోదం తెలిపింది:
మూడో డిస్కమ్ ఏర్పాటు: ప్రస్తుతం ఉన్న NPDCL (ఉత్తర), SPDCL (దక్షిణ) డిస్కమ్‌లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ కొత్త డిస్కమ్ పరిధిలోకి ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కనెక్షన్లు రానున్నాయి.
పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు: 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ మరియు 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలుకు త్వరలోనే ఐదేళ్ల కాలపరిమితితో టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
పెట్టుబడులకు ఆహ్వానం: రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడిదారులు వస్తే, ప్రభుత్వమే అవసరమైన భూమి, నీటిని కేటాయించి ప్రోత్సహించాలని నిర్ణయించారు.
కొత్త పరిశ్రమలకు వెసులుబాటు: కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును సొంతంగా (Captive Power Generation) ఉత్పత్తి చేసుకునేందుకు ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణం: రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పాల్వంచ, మక్తల్‌లోనూ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: AP: ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం
హైదరాబాద్‌లో భూగర్భ కేబుల్ వ్యవస్థ
నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి హైదరాబాద్‌ను 3 సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ (Underground Power Cable System) ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీనితో పాటు, టీ-ఫైబర్ కేబుళ్లను కూడా భూగర్భంలోనే ఏర్పాటు చేయాలని సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు ₹14,725 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
విద్య, శిక్షణకు స్థల కేటాయింపు
యంగ్ ఇండియా స్కూల్: భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం మండలం, పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయింపునకు ఆమోదం తెలిపారు.
స్పోర్ట్స్ స్కూల్: ములుగు జిల్లా, జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు 40 ఎకరాల స్థలం కేటాయించడానికి అనుమతి ఇచ్చారు.
అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు: జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్రంలోని మరో 6 ఐటీఐలలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ల (ATCs) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
