Delhi: దేశంలో పెరుగుతున్న స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. గడిచిన ఒక ఏడాది కాలంలోనే ఏకంగా 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొంటున్న సుమారు ఒక లక్ష సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచినట్లు కూడా తెలిపింది.
ప్రజల నుంచి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వచ్చే ఫిర్యాదులే ఈ చర్యలకు కారణమని ట్రాయ్ స్పష్టం చేసింది. స్పామ్ కాల్స్, ప్రోమోషనల్ మెసేజ్‌లు, ఫ్రాడ్ లింకులు వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. నంబర్‌ను ఫోన్లో బ్లాక్ చేయడం సరైన పరిష్కారం కాదని, అది కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే పనిచేస్తుందని ట్రాయ్ హెచ్చరించింది.
స్పామ్‌కు సంబంధించిన ఫిర్యాదులను ‘ట్రాయ్ డీఎన్డీ’ యాప్ ద్వారా రిపోర్ట్ చేయాలని ప్రజలకు సూచించింది. డీఎన్డీ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులను టెలికాం సేవల సంస్థలు నేరుగా పరిశీలించి, ఆ నంబర్లను శాశ్వతంగా నిలిపివేస్తాయని ట్రాయ్ పేర్కొంది. గత ఏడాది పెద్ద ఎత్తున నంబర్ డిస్కనెక్షన్ జరగడానికి ప్రజలే ముందుకు వచ్చి ఈ యాప్‌ను విస్తృతంగా ఉపయోగించడమే కారణమని తెలిపింది.
ఆర్థిక మోసాలు, యుపీఐ స్కామ్‌లు, లింక్ ఫ్రాడ్ల వంటి వాటికి గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి సంప్రదించవచ్చని ట్రాయ్ సూచించింది. అలాగే cybercrime.gov.in పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. టెలికాం మోసాలను గుర్తించడానికి ‘సంచార్ సాథీ’లోని ‘చక్షు’ ఫీచర్‌ను వినియోగించవచ్చని తెలిపింది.
సీనియర్ సిటిజన్లు, మహిళలు, డిజిటల్ లావాదేవీలపై అవగాహన తక్కువగా ఉన్నవారు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, లింక్‌లు, OTPలు వంటి వాటిపై జాగ్రత్త అవసరమని ట్రాయ్ మరోసారి గుర్తుచేసింది.
