Kadiyam srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా గురించి ప్రస్తుతం ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్పంచ్‌లు, కార్యకర్తలు ఉప ఎన్నికల గురించి అనవసరంగా చర్చలు చేయవద్దని సూచించారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ— “ప్రస్తుతం నేను రాజీనామా చేయాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభాపతి ఏమి నిర్ణయిస్తారో చూసి, తర్వాత నా ప్రణాళికను నిర్ణయిస్తాను.” “ఏ నిర్ణయం వచ్చినా నాకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల సహకారం తప్పకుండా ఉంటుంది.” అని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన శ్రీహరి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో, హైకోర్టు ఆదేశాల ప్రకారం సభాపతి కడియం శ్రీహరితో సహా 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరుతున్నారు.
