CP Radhakrishnan: శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు పుట్టపర్తిలోని హిల్వ్యూ స్టేడియంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యసాయిబాబా సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచారని, ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తం అయ్యాయని కొనియాడారు.
సేవే ప్రధాన సిద్ధాంతం
సత్యసాయి కులం, మతం, ప్రాంతం, దేశాలకు అతీతంగా మానవత్వాన్ని చాటిచెప్పారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఆయన శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు నిలువెత్తు రూపమని అన్నారు. సత్యసాయిబాబా మానవ సేవే మాధవ సేవ అని నమ్మి, దాన్ని ఆచరణలో చూపారని, ప్రపంచమంతా ప్రేమను పంచారని తెలిపారు. లక్షలాదిమందిని ఆయన నిస్వార్థ సేవా మార్గంలో నడిపించారని, ఈ సిద్ధాంతాలు నేటికీ దేశవిదేశాల్లో అమలవుతున్నాయని వివరించారు.
Also Read: Hyderabad: ఫలించని కృషి.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు అన్ని పైరసీ
ట్రస్టు ద్వారా ప్రపంచవ్యాప్త సేవలు
సత్యసాయి ట్రస్టు ప్రపంచదేశాల్లో సేవలు అందిస్తోందని, దీనికి లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. విద్య, వైద్యం, సామాజిక సేవల విషయంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి మరువలేనిదని అన్నారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. తాగునీటి సేవల్లో భాగంగా తమిళనాడులో తెలుగు గంగ కెనాల్ ద్వారా చెన్నై ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించి వారి దాహార్తిని తీర్చారు.

