iBomma Ravi:ఎంతో మందిని హత్య చేసిన ఓ వ్యక్తిని గుర్తించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల తరం కాలేదు. దీంతో ఢిల్లీ నుంచి ఓ పోలీస్ అధికారిని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమిస్తారు. ఆయన హైదరాబాద్ వస్తారు. రాగానే ఆ నిందితుడి అనుచరులను అరెస్టు చేయాలని ఆజ్ఞాపిస్తాడు ఆ దర్యాప్తు అధికారి. వారిని గొడ్లను కొట్టినట్టుగా పోలీసులతో కొట్టిస్తారు. కానీ ఏ ఒక్కరూ ఆ నిందితుడి ఆచూకీ చెప్పకపోగా, ఆయన మా పాలిటీ దేవుడు అని అంటారు. అప్పుడే ఆ దర్యాప్తు అధికారి ఫిక్సయ్యాడు. ఆ నిందితుడు ఓ ఆశయం కోసం పనిచేస్తున్నట్టు గుర్తిస్తాడు. ఇది ఠాగూర్ సినిమాలోని సీన్. కట్ చేస్తే..
iBomma Ravi:ఐ బొమ్మ రవి.. సినిమాలు పైరసీ చేసి రిమాండ్‌లో ఉన్న నిందితుడు. అలాంటి నిందితుడికి విచారణ అనంతరం భారత చట్టాల ప్రకారం శిక్ష కూడా పడవచ్చు. మరి ఇదేంటి.. ఐబొమ్మ రవి మా హీరో.. మా పాలిటి దేవుడు.. మా పాలిటి రాబిన్ హుడ్.. మా ఠాగూర్.. అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జనం తెగ పొగిడేస్తున్నారు. ఆయన చేసింది తప్పే అయినా.. సినిమా వాళ్లు చేసేది ఇంకా పెద్ద తప్పు అంటూ మెజారిటీ ప్రజలు తీర్పులే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఠాగూర్ లాంటి ఆశయవాది కాకపోవచ్చు కానీ, టికెట్ ధరల పెంపుతో సినిమా వినోదానికి దూరమైన పేదలు ఎందరో ఐబొమ్మ రవిని ఆ సినిమాలోని ఠాగూర్‌లాగే భావిస్తున్నారు.

iBomma Ravi:ఇదిలా ఉండగా, ఐబొమ్మ రవి అరెస్టు కాగానే పోలీసు అధికారులను కలిసి సినీవర్గాలు ప్రత్యేకంగా అభినందించాయి. పోలీస్ శాఖను మెచ్చుకున్నాయి. తెలుగు సినిమాకు పట్టిన గ్రహణం వీడింది.. అని సంబురాలే పడ్డారు. ఓ నిర్మాత ఏకంగా తన ఆక్రోశాన్ని ఆపుకోలేక ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఆగ్రహంతో తన మనసులోని మాటను బయటకు కక్కేశారు. ఆయనతోపాటు సినీవర్గాల ఆవేశానికి ఓ కారణం ఉండి ఉంటుంది. మరి భారీగా సినిమా టికెట్ల పెంపుతో సామాన్యులకు సినిమా చూసే భాగ్యాన్ని దూరం చేశారన్న ఆక్రోశంతో ఐబొమ్మ రవికి మద్దతిచ్చే వారికీ ఓ కారణం ఉంటుందని తెలుస్తున్నది.
iBomma Ravi:ఇలా ఐబొమ్మ రవికి మద్దతుగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో ఎమ్మెల్సీ, బీసీ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఆయన ఏకంగా సీపీ సజ్జనార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
iBomma Ravi:ఐబొమ్మ రవిని ఆయన భార్య కనుక పట్టించి ఉండకపోతే అతడిని మీ పోలీసులు పట్టుకునేవారా? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. సినిమా టికెట్ల పెంపుపై సామాన్యులకు పడిన భారాన్ని ఆయన ఏకరువు పెట్టారు. సినిమా థియేటర్లలో ఇతర వస్తువుల రేట్లపై భగ్గుమన్నారు. సినిమా వాళ్లతో కలిసి ఐబొమ్మ రవి ఏదో తప్పు చేసిండని సజ్జనార్ వ్యవహారం ఉన్నదని వివాదాస్పదంగా మాట్లాడారు. అదేవిధంగా ఆయన ఎన్‌కౌంటర్లపైనా తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
iBomma Ravi:తీన్మార్ మల్లన్న అంశం ఒకటైతే.. తెలంగాణకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఏకంగా తన ఆటోపై వెనుక ఐబొమ్మ రవికి మద్దతుగా పోస్టర్ వేసుకున్నాడు. తెలంగాణ రియల్ హీరో ఐబొమ్మ రవి.. అని ఉన్న ఆ పోస్టర్ వేసి ఉన్న ఆటో తిరుగుతున్న వీడియో హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొడుతుంది. ఈ ఒక్క ఆటో డ్రైవర్ యే కాకుండా.. సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఐబొమ్మ రవికి సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఏకంగా ఆయన అరెస్టునే తప్పుబడుతున్నారు.
iBomma Ravi:ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. పైరసీ చేయడం తప్పే.. కానీ, టికెట్ రేట్లు, థియేటర్లలో వస్తువుల ధరలు ఇష్టారీతిన పెంపుతోనే ఐబొమ్మలో సినిమాలు పైరసీ అయ్యాయని, వాటిని తాము పెద్ద ఎత్తున చూడాల్సి వచ్చిందని వారు చెప్పుకొస్తున్నారు. అసలు సినిమా నిర్మాణానికి వందలు, వేల కోట్లు ఖర్చు పెట్టడమెందుకు సినిమా టికెట్ల ధరలు పెంచడమెందుకు? అని వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఐబొమ్మ రవి సామాన్యుల్లో క్రేజీ మామూలుగా లేదు.

