Maria Corina Machado: వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న విపక్ష నాయకురాలు మరియా కొరీనా మాచడోకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ, ఈ గౌరవం ఆమెకు అతిపెద్ద సవాలుగా మారింది. నోబెల్ స్వీకరణకు దేశం దాటితే.. ఆమెను ‘పరారీలో ఉన్న నేరస్థురాలిగా’ ప్రకటిస్తామని వెనిజులా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
ప్రజాస్వామ్య విలువలు, శాంతియుత పోరాటాన్ని గౌరవిస్తూ… ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వెనిజులా విపక్ష నేత, ధీశాలి అయిన మరియా కొరీనా మాచడో (Maria Corina Machado)ను వరించింది. ఏకాధిపత్య పాలనకు వ్యతిరేకంగా, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆమె చేసిన సాహసోపేత పోరాటాన్ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా కొనియాడింది.
అవార్డు స్వీకరణకు వెళ్తే… అంతర్జాతీయ అరెస్టు!
సాధారణంగా నోబెల్ బహుమతి లభించడం అనేది ఒక జీవితకాలపు కల. కానీ, మాచడోకు ఈ గౌరవం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఆ వేడుకకు హాజరు కావాలంటే మరియా కొరీనా తప్పనిసరిగా వెనిజులా దేశ సరిహద్దులు దాటాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Ram Charan: ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్.. రిలీజ్ డేట్ మార్చుకున్న పెద్ది?
ఇక్కడే వెనిజులా అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ (Tarek William Saab) సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ మాచడో నోబెల్ బహుమతిని స్వీకరించేందుకు దేశం దాటి వెళ్తే ఆమెను తక్షణమే ‘పరారీలో ఉన్న నేరస్థురాలిగా’ (Fugitive) ప్రకటిస్తామని హెచ్చరించారు.
దేశద్రోహం, ఉగ్రవాదం ఆరోపణలు
ప్రస్తుతం మరియా కొరీనా మాచడోపై వెనిజులా ప్రభుత్వం తరపున ఉగ్రవాదం, దేశద్రోహం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలతో కూడిన పలు కేసులు విచారణలో ఉన్నాయి. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ఆమె ధైర్యం చేసి దేశం దాటితే, వెనిజులా ప్రభుత్వం వెంటనే ఆమెపై అంతర్జాతీయ వారంట్‌ను జారీ చేసి అరెస్టు చేయించే అవకాశం ఉంది.
ప్రస్తుతం మాచడో రాజధాని కారకాస్‌లోనే ఉన్నారు. ఒకవైపు ప్రపంచ అత్యున్నత గౌరవం ఆమెను పిలుస్తుంటే, మరోవైపు దేశ సరిహద్దు దాటితే అరెస్టు భయం వెంటాడుతోంది. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ధీశాలి, తన పోరాటానికి దక్కిన బహుమతిని స్వీకరిస్తుందా? లేక ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గి కార్యక్రమానికి గైర్హాజరు అవుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.
