Maoist Hidma

Maoist Hidma: నేను లొంగిపోవడానికి సిద్ధం.. ఇంతలోనే మృతి.. జర్నలిస్ట్‌కు లేఖ రాసిన హిడ్మా

Maoist Hidma: మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలక నేత, గెరిల్లా దాడి వ్యూహకర్త, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మంగళవారం ఏపీలోని మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అయితే, హిడ్మా మృతి వెనుక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌కౌంటర్ జరగడానికి కేవలం పది రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి లొంగిపోయే ఆలోచనలో ఉన్నట్లు ఒక జర్నలిస్ట్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

బస్తర్ జర్నలిస్ట్‌కు చివరి లేఖ

హిడ్మా నవంబర్ 10న బస్తర్‌కు చెందిన ఒక జర్నలిస్ట్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తన భవిష్యత్ కార్యాచరణ మరియు లొంగిపోయే ఆలోచనల గురించి వివరించారు. అందులో ఆయుధాలు వదిలే ఆలోచనలో ఉన్నామని, అయితే ఎక్కడ లొంగిపోవాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. తమ భద్రతకు హామీ లభిస్తే లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని అయన తెలిపారు.

ఇది కూడా చదవండి: Maanya Anand: కమిట్‌మెంట్ ఇస్తే సినిమా ఇస్తానన్నాడు.. ధనుష్ మేనేజర్‌పై మాన్య ఆనంద్ ఆరోపణలు

ఆయుధాలను వీడే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో జర్నలిస్ట్‌ను కోరారు. త్వరలో ఈ అంశాలపై హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ విడుదల చేస్తామని హిడ్మా పేర్కొన్నారు. ఈ చర్చల నిమిత్తం తనను త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కలవాలని ఆ జర్నలిస్ట్‌కు సూచించినట్లు సమాచారం. లొంగిపోయేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలోనే హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతి

ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం… ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో కీలక నేత మద్వి హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ మరియు మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీసులు హిడ్మా, రాజీ మృతదేహాల ఫోటోలను విడుదల చేస్తూ మరణాన్ని నిర్ధారించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *