Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) అంచనాలను తలకిందులు చేశాయి. ఎన్నికలకు ముందు, అధికార జేడీయూ 25 సీట్ల కంటే ఎక్కువ గెలవదని, ఒకవేళ గెలిస్తే తాను రాజీనామా చేస్తానని పీకే చేసిన సంచలన వ్యాఖ్యలు.. తాజాగా ఎన్నికల ఫలితాల తర్వాత హాస్యాస్పదంగా మారాయి.
ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 202 స్థానాలతో (బీజేపీ 89, జేడీయూ 85) సునామీ సృష్టించగా, పీకే స్థాపించిన జన్ సురాజ్ పార్టీ మాత్రం డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ ఘోర ఓటమి నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ప్రశాంత్ కిషోర్, తన పాత ప్రకటనలపై వ్యూహాత్మకంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు.
రాజీనామా అంశంపై తెలివిగా తప్పించుకున్న పీకే
జేడీయూ 25 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే రాజీనామా చేస్తానని చేసిన ప్రకటన గురించి మీడియా ప్రశ్నించగా, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సమాధానం ఇది.. నేను ఏ పదవిలో లేను. కాబట్టి నేను ఏ పదవికి రాజీనామా చేయాలి? అయినా నేను బీహార్‌ను వదిలి వెళ్తానని ఎప్పుడూ చెప్పలేదే. నేను రాజకీయాలు చేయనని చెప్పాను. ఇప్పుడూ అదే మాట మీద ఉన్నా. నేను చేసేది రాజకీయాలు కాదు. ప్రజల గొంతును వినిపించడం రాజకీయాలు కాదు.
తాను ఇప్పటికీ రాజకీయాలు చేయడం లేదని బుకాయించడం ద్వారా, తన పాత సవాల్‌కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నుంచి పీకే తెలివిగా తప్పించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Nayanthara: NBK111: రాణి లుక్ లో ఆకట్టుకున్న నయనతార!
ఓటమి బాధ్యత నాదే: పీకే ఆవేదన
ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ పీకే ఓటమి బాధ్యతను పూర్తిగా తనపై వేసుకున్నారు. మా ఆలోచనల్లో ఏదో తప్పు జరిగి ఉంటుంది. ఓటమి పూర్తి బాధ్యత తనదే. 100 శాతం ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నాను. బీహార్ రాజకీయాలను మారుద్దామని కొత్త పాత్ర పోషించాం. కానీ ప్రజలు మమ్మల్ని కోరుకోలేదు. మా ఆలోచనల్లో ఎక్కడో, ఏదో జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. చాలా నిజాయితీగా ప్రయత్నించాం… కానీ అది పూర్తిగా విఫలమైంది. దీన్ని అంగీకరించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. గత మూడేళ్లుగా నా శక్తినంతా ధారపోసినప్పటికీ, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బీహార్‌ను మెరుగుపరచాలనే నా సంకల్పం నెరవేరే వరకు ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదు.
ప్రాయశ్చిత్తంగా ఒక్కరోజు మౌన ఉపవాసం
బీహార్ ప్రజలకు కొత్త వ్యవస్థ ఎందుకు అవసరమో వివరించి చెప్పడంలో తాను విఫలమైనట్లు పీకే ఒప్పుకున్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఈనెల 20వ తేదీన గాంధీ భీతిహర్వా ఆశ్రమంలో ఒక్కరోజు మౌన ఉపవాసం చేయబోతున్నట్లు ప్రకటించారు.
తాను తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఎలాంటి నేరం చేయలేదని స్పష్టం చేశారు. “సమాజంలో కుల ఆధారిత ద్వేషాన్ని వ్యాప్తి చేసే నేరం చేయలేదు. ఎక్కడా కూడా హిందూ-ముస్లిం రాజకీయాలు చేయలేదు. మతం పేరుతో ప్రజలను విభజించే నేరం చేయలేదు. బీహార్‌లోని పేద, అమాయక ప్రజలకు డబ్బు ఇచ్చి ఓట్లు కొనే నేరం ఏ మాత్రం చేయలేదు,” అంటూ తన వైఖరిని వివరించారు.
ఎన్డీఏ సునామీ: సీట్ల వివరాలు (మొత్తం 243)
-
ఎన్డీఏ కూటమి: 202 సీట్లు (బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19, HAMS 5, రాష్ట్రీయ లోక్ మోర్చా 4)
-
ఆర్జేడీ: 25 సీట్లు
-
కాంగ్రెస్: 6 సీట్లు
-
ఎంఐఎం: 5 సీట్లు
-
జన్ సురాజ్ పార్టీ: డిపాజిట్లు కోల్పోయింది.

